ఆదర్శం... అపహాస్యం ! | Sakshi
Sakshi News home page

ఆదర్శం... అపహాస్యం !

Published Sat, Jun 27 2015 1:44 AM

Inter Admission to come forward

విజయనగరం అర్బన్: గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ (ఆదర్శ) స్కూల్స్ వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండుడగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన ఆదర్శ పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నాయి. నాణ్యమైన బోధనలు అందక పాఠశాలస్థాయిలో విద్యార్థులు వెనుతిరుగుతున్నారు. అదే విధంగా  ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాల్లో అధికవేతనాలిచ్చిన బోధన, బోధనేతర సిబ్బందితో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు ఆ పేరునే అపహాస్యం చేస్తున్నాయి.  
 
 బోధన ప్రమాణాలు లేక..  
 జిల్లాలో 16 మండలాల్లో మూడేళ్ల క్రితం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.  మోడల్ స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ బోధన అందుతుందని, అర్హతగల టీచర్లను నియమించారని, బోధనాప్రమాణాలు బాగుంటాయని తొలి రెండేళ్లు వీటిలో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడ్డారు.   జిల్లా స్థాయిలో పర్యవేక్షణ లోపంతో కొన్ని పాఠశాలల  ప్రిన్సిపాళ్లు  ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల  బోధన ప్రమాణాలు దిగజారాయి. దీంతో పాఠశాల నుంచి వెనుతిరిగే విద్యార్థుల సంఖ్య ఇటీవల  పెరిగింది.  16 పాఠశాల నుంచి పాఠశాలలోని 6, 7, 8, 9వ తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులు పాఠశాలలను వీడారు.
 
 జిల్లా కేంద్రంలోని విజయనగరం మోడల్ స్కూల్ నుంచి అత్యధికంగా 25 మంది వరకు  పాఠశాలను విడిచిపెట్టారు. టీసీల కోసం దరఖాస్తులు చేసిన వారు ఇంకా ఉన్నారు. అదే విధంగా ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసిన వారంతా చేరడం లేదు. కళాశాలల్లో ప్రధానమైన సబ్జక్టులకు అధ్యాపకుల కొరత ఉండడంతో ప్రవేశాలకు ముందుకు రావడం లేదు.  ఇంటర్ మొదటి సంవత్సరానికి ఒక్కొక్క గ్రూప్‌కి 20 మంది చొప్పున నాలుగు గ్రూప్‌లకు 80 మంది విద్యార్థులను చేర్చుకునే అవకాశం ఉంది.   ఈ మేరకు జిల్లాలోని 16 పాఠశాలల్లో 1,280 సీట్లకు ప్రవేశాలు కల్పించవచ్చు. తొలి ఏడాది 2013-14లో ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ మినహా మిగిలిన గ్రూపులకు వెయ్యి మంది వరకు దరఖాస్తులు చేసుకోగా కేవలం 700 మంది మాత్రమే ప్రవేశాలకు ముందుకొచ్చారు. కళాశాలలకు వెళ్లాక బోధన సిబ్బంది కొరత కారణంగా వీరిలో 50 శాతం మంది రెండవ సంవత్సరం అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇంటర్ బోధనలు చేపట్టే పీజీటీ అధ్యాపకుల కొరత ఒకవైపు పట్టిపీడిస్తుంటే... మరో పక్క కళాశాల నిర్వాహణపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్కూళ్లపై రాష్ట్ర విద్యాశాఖకు పూర్తి స్థాయిలో అధికారాలు ఉండవు.
 
 దీంతో సంబంధిత ప్రిన్సిపాళ్లు పాఠశాల అభివృద్ధి పై శ్రధ్దచూపడం లేదనే   తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుల, ఉపాధ్యాయుల మధ్య విభేదాలతో బోధన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని వాపోతున్నారు.  
 
 గెస్ట్ అధ్యాపకులేరి..?
 బోధనా సిబ్బంది కొరత ఉన్న పాఠశాల్లో గెస్ట్ అధ్యాపకులను వేసుకొనే వెసులుబాటు సంబంధిత ప్రిన్సిపాళ్లుకు ఉంది.   ప్రాధాన్యత ఉన్న ఖాళీల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్ అధ్యాపకులను నియమించుకోవచ్చు. ఆ మేరకు పాఠశాల స్థాయిలో ఆర్ధిక లావాదేవీల్లో వెలుసుబాటు కల్పించారు.   జిల్లాలో 16 పాఠశాలలకు బోధన సిబ్బంది 320 మంది అవరసం కాగా, 228 పోస్టులు  మాత్రమే భర్తీ అయ్యాయి. వీటిలో 7 కళాశాలలకు ప్రిన్సిపాళ్లతో పాటు 48 పీజీటీలు, 37 టీజీటీలు ఖాళీలున్నాయి. ప్రాధాన్యతగల ఇంటర్ ఎంపీసీలోని మాథ్స్ పీజీటీలో అధికంగా ఉన్నాయి. దీంతో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు తగ్గుతున్నాయి.
 
 కంప్యూటర్ సామాగ్రి ఉన్నా..
 ఒక్కో పాఠశాలకు ఏడు కంప్యూటర్లు గత ఏడాది మొదటి నెలలోనే సరఫరా చేశారు. స్థానిక విజయనగరం మోడల్ స్కూళ్లో ఏడాది గడిచినా కంప్యూటర్లను గదుల్లో పెట్టకుండా స్టోర్ రూంలోనే ఉంచారు.   కంప్యూటర్ విద్యను బోధించే ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలకు ఉన్నారు.  పాఠశాలల్లో వంటగది, అందుకు సంబంధించిన డైనింగ్ హాల్‌లు ఉన్నప్పటికీ పలు పాఠశాలల్లో ఆరుబయటే వంటలు సాగుతున్నాయి.
 

Advertisement
Advertisement