ప్రియురాలికి బహుమతుల కోసం ... ఇంటర్ విద్యార్ధి | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి బహుమతుల కోసం ... ఇంటర్ విద్యార్ధి

Published Mon, Aug 4 2014 3:18 AM

inter stundent theft in homes, for girl friends gifts

- ప్రియురాలికి బహుమతులిచ్చేందుకు చోరీలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి
-తా ళం వేసిన ఇళ్లలో చొరబడి డబ్బు మాత్రమే దొంగిలించిన వైనం
 ధర్మవరం : బహుమతులతో ప్రియురాలి మెప్పు పొందడం కోసం ఓ విద్యార్థి దొంగగా మారాడు. రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని లోపలకు చొరబడి డబ్బు మాత్రమే చోరీ చేయడం, యథావిధిగా పగలు కాలేజీకి వెళ్లడం చే సేవాడు. ఇలా మూడు చోరీలకు పాల్పడ్డాడు. ఆనక పోలీసులకు పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ప్రేమ దొంగ వివరాలు ఇలా.. పట్టణంలోని యాదవ వీధిలో ఓ ఇంటి ఎదుట అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విద్యార్థిని శనివారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.30 వేలకు పైగా నగదు లభ్యమైంది.

అతన్ని స్టేషన్‌కు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దీంతో నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి. అతనో విద్యార్థి(16). పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతనికి ఓ అమ్మాయితో పరిచయమైంది. ఆమె పుట్టిన రోజున గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. చేతిలో డబ్బు లేదు. దీంతో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో, స్థానిక సిద్దయ్యగుట్ట, యాదవ వీధిలోఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులగొట్టి నగదు మాత్రమే దొంగిలించడం.. బీరువాలో నగదు దొరక్కపోతే దేవునిహుండీ ఎత్తుకు పోవడం చేసేవాడు.

ఇలా ఎస్‌బీఐ కాలనీలో దాదాపు 30 తులాల బంగారు బీరువాలో ఉన్నప్పటికీ దానిని ముట్టుకోకుండా కేవలం హుండీలో ఉన్న డబ్బును, బీరువాలో ఉన్న కొద్దిపాటి నగదును మాత్రమే అపహరించాడు. యాదవ వీధి, సిద్దయ్యగుట్టలోని ఇళ్లలోనూ నగలు, ఇతర విలువైన వస్తువులను ముట్టుకోకుండా నగదు మాత్రమే ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మైనర్ కావడం.. అందునా విద్యార్థి అయిన కారణంగా పోలీసులు ఆ విద్యార్థిని కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపి నేర ప్రవృత్తిని మార్చుకునేలా పరివర్తన తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement