తెలుగు తమ్ముళ్ల మధ్య మట్టి రగడ | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల మధ్య మట్టి రగడ

Published Wed, May 9 2018 8:49 AM

internal fight in Telugu Desam Party leaders - Sakshi

ప్రత్తిపాడు: మండలంలోని వంగిపురం గ్రామ చెరువుల్లో మట్టి తవ్వకాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. సర్పంచి భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎంసీటీసీ మాజీ సభ్యుడు ఫిర్యాదు చేయడంతో పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. గ్రామంలోని రక్షిత మంచి నీటి చెరువు, చిన్న చెరువులో మట్టి తోలుకునేందుకు టీడీపీ నాయకులు మండల అధికారులతో పాటు మైనింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. మైనింగ్‌ అధికారులు రక్షిత మంచి నీటి చెరువులో అడుగున్నర లోతు మాత్రమే మట్టి (పూడిక) తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారు. 

అయితే అనుమతి పొందిన చెరువును వదిలి చిన్న చెరువులో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు కొందరు మండల అధికారులు, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్న చెరువులో తవ్వకాలను నిలిపి, మంచినీటి చెరువులో చేపట్టారు. ఈ తవ్వకాలపై సర్పంచ్‌ భర్త పాపయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గండూరి శ్రీనివాసరావు మధ్య వివాదం జరుగుతోంది. గండూరి శ్రీనివాసరావు మంగళవారం రక్షిత మంచి నీటి చెరువు చెరువు వద్దకు వెళ్లి తవ్వకం అనుమతులు, మైనింగ్‌ బిల్లుల విషయమై పాపయ్యను ప్రశ్నించారు. దీంతో వివాదం తలెత్తింది. పాపయ్య తనను కాలితో తన్ని చంపుతానని బెదిరించారంటూ శ్రీనివాసరావు పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. 

పంచాయతీ పేరుతో మట్టి స్లిప్పులు
వంగిపురం పంచాయతీ పేరుతో మట్టి తోలించుకునే వారికి స్లిప్పులు పంపిణీచేస్తున్నారు. పంచాయతీ అధికారులే స్లిప్పులను ముద్రించారా? ఆ సొమ్మును పంచాయతీకి జమచేస్తున్నారా? ఇందులో పంచాయతీ కార్యదర్శి ప్రమేయం ఉందా? కార్యదర్శికి తెలియకుండా పంచాయతీ పేరుతో స్లిప్పులను ముద్రించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్లిప్పుల విషయమై  ఈఓపీఆర్డీ గిరిధరరావును ప్రశ్నించగా విషయం తన దృష్టికి పూర్తిస్థాయిలో రాలేదన్నారు. బుధవారం గ్రామానికి వెళ్లి విచారిస్తానని తెలిపారు. తహసీల్దార్‌ ప్రసాదరావును ప్రశ్నించగా మైనింగ్‌ అధికారులు ఒక్క చెరువుకే అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement