Sakshi News home page

భగవంతుడా...

Published Sun, Jun 14 2015 1:19 AM

భగవంతుడా...

గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’
 
ఏపీలోని ధవళేశ్వరం వద్ద పెను విషాదం.. ఒకే ఇంట్లో 14 మంది మృతి
మరో రెండు కుటుంబాల్లో 8 మందిని కాటేసిన మృత్యువు
పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తుండగా ఘటన

 
మాటలకందని మహా విషాదం అంటే ఇదేనేమో.. తిరుమలలో వెంకన్నకు, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి, శ్రీశైలంలో మల్లన్నకు, బెజవాడలో దుర్గమ్మకు మొక్కిన చేతులు.. తెల్లవారితే సింహాచలంలో అప్పన్న సన్నిధిలో జోడించాలనుకున్న చేతులు.. నిశ్చేతనమయ్యాయి. శుక్రవారం రాత్రి గోదారమ్మ తీరం వెంట పిల్లా పాపల కేరింతలతో సాగిపోతున్న వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై ఎడమ వైపు వెళ్తున్న తూఫాన్ వాహనం డ్రైవర్ ఒక్క క్షణం రెప్ప వాల్చటంతో కుడివైపు తిరిగింది. నిశిరాత్రివేళ బ్యారేజీ గోడను ఢీకొట్టి 30 అడుగుల లోతులో పడటంతో పెను ప్రమాదం జరిగింది. 22 మంది  మృత్యువాత పడ్డారు. ఇద్దరు బిడ్డల నిండు జీవితాలను కాపాడుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తండ్రి.. కుమారుడిని మాత్రం రక్షించుకుని కన్నుమూశాడు. ఆ బాలుడు ఈ ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడిగా మిగిలాడు.సాక్షి, విశాఖపట్నం, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పెను ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారు లున్నారు.

వీరంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన వారి సమీప బంధువులు. ఇష్టదైవాల్ని దర్శించుకుని, తిరుగుముఖం పట్టిన వీరు గమ్యం చేరకుండానే మృత్యు వాతపడ్డారు. ఈ బృందంలోని ఒకే ఒక్క బాలుడు జరిగిన ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడయ్యూడు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ప్రధాన గేట్లు దాటిన వెంటనే వచ్చే మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం నేరుగా స్కవర్ స్లూయిజ్‌లోకి బోల్తా కొట్టింది. ఆ వాహనం 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న సిమెంట్ గచ్చుపై పడిపోయింది. ప్రయాణికులు గచ్చుపై పడడంతో బలమైన తీవ్ర గాయాలై మృతిచెందారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్‌గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్ని బట్టి అర్ధరాత్రి రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 వరకూ ఎవరికీ తెలియలేదు. మృత్యువు నుంచి బయటపడిన కిరణ్‌సాయి బ్యారేజీ దిగువ రోడ్డుకు వచ్చి ‘మా అక్కకు నీళ్లు కావాలంటూ..’ అరవడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులకు తెలిసింది. వారు దగ్గరలో ఉన్న లాకు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కార్యాలయ సిబ్బంది ధవళేశ్వరం పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన తూఫాన్ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుడు గోపి స్నేహితుడు జె.హేమంత్ మొదట చనిపోయినవారిని గుర్తిం చాడు. ఘటనాస్థలిలో 21 మంది మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కిరణ్, బాలిక సంధ్యలను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంధ్య మృతిచెందింది. కిరణ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎప్పుడూ తీర్థయాత్రలకు జనాన్ని తీసుకెళ్లే ఈగల అప్పారావు ఈ ఏడాది తన కుటుంబ సభ్యులను, బంధువులను 22 మందిని తీసుకెళ్లాడు. స్వతహాగా డ్రైవరు అయిన అప్పారావు సొంత తుఫాన్ వ్యాన్ (ఏపీ 31 టీసీ-3178)లో 6వ తేదీన తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వీరిని వెంటబెట్టుకువెళ్లాడు. 9వ తేదీన తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 12వ తేదీన (శుక్రవారం) విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరారు. శనివారం ఉదయం సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు వెళ్లాలనుకున్నారు. ఈలోపే ప్రమాదం బారిన పడ్డారు.

 తెల్లారేసరికి పిడుగులాంటి వార్త..
 తమ వారంతా యాత్రలు ముగించుకుని వచ్చేస్తున్నారని ఇంటి వద్ద మిగిలిన వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెల్లవారే సరికి పిడుగులాంటి వార్త టీవీల్లో వచ్చింది. గోదావరిలో తూఫాన్ వ్యాన్ బోల్తాకొట్టిందని అందులో ఉన్న 22 మంది మృత్యువాతపడ్డారని.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మోసయ్యపేట వాసులని. అంతే.. మన డ్రైవర్ ఆప్పారావు వ్యానే అని నిర్ధారణకొచ్చారు. తెల్లారగానే ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పరుగుపరుగున అప్పారావు, వారి బంధువుల ఇంటికి తండోపతండోలుగా వెళ్లారు. అప్పారావు కుటుంబంతా మృత్యువాతపడగా.. ఇప్పుడా కుటుంబంలో అప్పారావు తండ్రి 85 ఏళ్ల వెంకులు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అయిన వారందరినీ పోగొట్టుకుని విగతజీవిలా ఉన్నాడు.  యాత్ర ముగించుకుని వీరు శనివారం సింహాచలం నృసింహస్వామిని దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు చేరుకోవలసి ఉంది. వారి ఆచారం ప్రకారం గ్రామం నుంచి శుక్రవారం రాత్రే 20 మందితో కలిసి తోడపెద్దు (ఆంబోతు)ను సింహాచలం పంపించారు. వీరంతా సింహాచలంలో అప్పారావు కుటుంబం కోసం వేచి చూస్తున్న తరుణంలోనే ఘోరం జరిగిపోయింది. మోసయ్యపేటతో పాటు సమీపంలోని అచ్యుతాపురం, పరిసర గ్రామాలు శనివారం  శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్ అప్పారావుగా పేరు గడించిన అప్పారావుకు ఈ ప్రాంతంలో మంచిపేరుంది. పాతికేళ్లుగా స్థానికుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తుండడంతో అందరితో పరిచయాలున్నాయి. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబీకులను ఓదార్చడానికి భారీ సంఖ్యలో ఇరుగుపొరుగు గ్రామాల వారు వచ్చారు. కాగా ఏపీ హోం మంత్రి చినరాజప్ప మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  
 
మృతుల వివరాలు
 ఈగల అప్పారావు(55), అతని భార్య కనక(40), పెద్ద కుమారుడు రాజు(27) కోడలు లక్ష్మి (23), రెండో కుమారుడు ప్రసాద్ (25), కోడలు అన్నపూర్ణ(21), మూడో కుమారుడు గోపి(24), అప్పారావు కుమార్తె కోనా వెంకటలక్ష్మి(27), అల్లుడు రమణ(30), అప్పారావు మనుమలు కోన సాయి(8), ఈగల హర్ష(2), ఈగల నవ్య(4), ఈగలఅమిత్(5), ఈగల కార్తీక్ (7) మృతి చెందారు. అప్పారావుకు వరసకు సోదరుడైన ఈగల రాంబాబు(32), అతని భార్య కొండమ్మ(30), తల్లి చిన్నమ్మ(60), రాంబాబు కుమార్తె సంధ్య(14), అప్పారావు సోదరి దార్ల చిట్టమ్మ(68), గాజువాక మండలం కుర్మన్నపాలెంకు చెందిన అప్పారావు మరదలు పుర్రే సునీత(29), మరో మరదలు రంబిల్లి మండలం కొత్తకోడూరుకు చెందిన అల్లు లక్ష్మి(35), సునీత కుమారుడు పుర్రే పవన్(8) మృతి చెందగా, రాంబాబు కుమారుడు కిరణ్‌సాయిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన  వైద్యం కోసం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.
 
 
 మూడు గంటల తర్వాత వెలుగులోకి..
 ధవళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూఫాన్ వ్యాను బోల్తా పడి ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత కాని ఈ సంఘటన వెలుగు చూడలేదు. కాటన్ హయాంలో నిర్మించిన పాత ఆనకట్ట, తరువాత నిర్మించిన బ్యారేజీ స్కవర్ల ఆపరేషన్ నిర్వహించే స్లూయిజ్ వద్ద వ్యాను బోల్తా కొట్టింది. అక్కడ 30 అడుగుల లోతున సిమెంట్ తొట్టెలా ఉంటుంది. ప్రమాదం జరిగిన చోట బ్యారేజీపై లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని గుర్తించ లేకపోయారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 గంటల సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్ గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్నిబట్టి అర్ధరాత్రి సుమారు రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 గంటల వరకూ ఎవరికీ ఈ విషయం తెలియలేదు.

 ముందే తెలిస్తే కొందరి ఊపిరైనా నిలిచేది: ప్రమాదం జరిగిన వెంటనే ఎవరికైనా తెలిసి ఉంటే కొంతమందైనా ప్రాణాలతో బయటపడేవారు. వాస్తవానికి కాటన్ బ్యారేజీపై సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకూ విషయం ఇరిగేషన్ సిబ్బందికి కూడా తెలియలేదు. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే లాకు కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బందికి మత్స్యకారులు చెప్పేవరకూ ప్రమాద విషయం తెలియక పోవడం గమనార్హం.
 

Advertisement

What’s your opinion

Advertisement