సభకు ఆహ్వానం | Sakshi
Sakshi News home page

సభకు ఆహ్వానం

Published Wed, Oct 14 2015 1:37 AM

సభకు ఆహ్వానం - Sakshi

ఉద్దండరాయునిపాలెంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ప్రత్యేక టెక్నాలజీతో     ఏర్పాట్లు, వాటర్ ఫ్రూప్ టెంట్లు
ఎమ్మెల్యేలకు హాయ్‌ల్యాండ్‌లో బస
 సీఎం చంద్రబాబును ఒప్పించిన  స్పీకర్ కోడెల

 
విజయవాడ :  ఈ ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఉద్దండరాయునిపాలెం వేదిక కానుంది. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబును ఒప్పించటంతో వచ్చే డిసెంబరులో ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్‌లోని అసెంబ్లీలోనే శాసనసభ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీని విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ సమావేశాల నిర్వహణలో తరచూ చిన్నపాటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోపక్క సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, పాలనా యంత్రాంగం కూడా ఎక్కువ రోజులు విజయవాడలోనే ఉంటూ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కేబినెట్ సమావేశాలు, పార్టీ రాష్ట్ర సమావేశాలు కూడా ఇక్కడే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంగణంలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు మంగళవారం కోడెల హైదరాబాదులో ప్రకటించారు. దానికనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు కూడా అందజేశారు.

సమావేశాల కోసం భారీ ప్రాంగణం...
అధునాతన టెక్నాలజీని ఉపయోగించి రెయిన్ ప్రూఫ్, సన్‌ప్రూఫ్ టెంట్‌లను వినియోగించి భారీ తాత్కాలిక సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. శంకుస్థాపన కోసం దాదాపు వంద ఎకరాల పైన ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో భద్రతా పరమైన ఏర్పాట్లతోపాటు సభ నిర్వహణకు ప్రాంగణం అనువుగా ఉంటుందని, అలాగే కారుపార్కింగ్, ఇతర సమస్యలు ఉండవనేది అధికారుల భావన.

హాయ్‌ల్యాండ్‌లో బస
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి హాజరయ్యే శాసనసభ్యులకు సభ జరిగే ఐదు రోజులపాటు హాయ్‌ల్యాండ్, సమీపంలోని ప్రధాన హోటళ్లలో ప్రభుత్వ ఖర్చులతో బస ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ అనంతరం యోగ గురువు రామ్‌దేవ్‌బాబాతో ఎమ్మెల్యేలకు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 

Advertisement
Advertisement