పారిశుద్ధ్యానికి ‘టెండర్’! | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యానికి ‘టెండర్’!

Published Sat, Apr 19 2014 3:12 AM

పారిశుద్ధ్యానికి ‘టెండర్’!

నరసన్నపేట, న్యూస్‌లైన్: సర్కారు ఆస్పత్రుల్లో  పారిశుద్ధ్య సేవల నిర్వహణను కేంద్రీకృతం చేసి రాష్ట్రస్థాయిలో ఒకే సంస్థ కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
 
 ఇప్పటి మాదిరిగా జిల్లా యూనిట్‌గానే ఖరారు చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను రాష్ట్రస్థాయిలో ఒక్కరికే అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు టెండర్లు కూడా ఆహ్వానించింది. ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ సెంటర్లు, జిల్లా, డివిజన్ స్థాయి ఆస్పత్రుల్లో ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థలు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాయి. గతంలో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండే వి. రోగులు, వారితోపాటు వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనితో పాటు పారిశుద్ధ్య పనివారి వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలు ఆర్థిక భారంతో కూడుకున్నవి కావడంతో ఈ మొత్తం బాధ్యతను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది.
 
 ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా సంస్థలను ఖరారు చేస్తున్నారు. దాంతో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం కాస్త మెరుగుపడింది. ఈ విధానంలో అవకతవకలకు ఆస్కారం ఉందని గుర్తించి, పారిశుద్ధ్య సేవలకు ముందుకు వచ్చే సంస్థల గత చరిత్రను పరిశీలించిన తర్వాత రెన్యువల్ పద్ధతిలో ప్రతి ఏటా వారికే అప్పగిస్తున్నారు. అయితే ఇటీవల అధికారులు కొత్త విధానం రూపొందించారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంస్థకు పారిశుద్ధ్య సేవల కాంట్రాక్టు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటన కూడా జారీ చేశారని తెలిసింది.
 
ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే సంస్థకు అప్పగించడం వల్ల మొక్కుబడి సేవలే అందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం ఏర్పడి ఆశించిన ఫలితం రాదని అంటున్నారు. అంతేకాక ప్రస్తుతం సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికేతర సమస్య ఉత్పన్నం కావడంతోపాటు అవినీతి అక్రమాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పునరాలోచించి జిల్లాలవారీగా పారిశుద్ధ్య టెండర్లు నిర్వహించాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement