కే. ఆర్. స్టేడియం ఆధునికీకరణపై నీలినీడలు! | Sakshi
Sakshi News home page

కే. ఆర్. స్టేడియం ఆధునికీకరణపై నీలినీడలు!

Published Thu, Dec 19 2013 3:44 AM

irregularities  in k.r. stadium modernization

శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణకు, క్రీడాకారుల శిక్షణ కార్యక్రమాలకు ఒకే ఒక్క ఆధారమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల ఇక్కడ ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల ముగింపు సభలో కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ స్టేడియం మరమ్మతులకు త్వరలో రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారే తప్ప ఆధునికీకరణ పనుల ఊసెత్తకపోవటంతో క్రీడాభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు స్పం దిస్తూ కేఆర్ స్టేడియం ఆధునికీకరణ గురించి పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపడతామని చెప్పటం సబబు కాదని కూడా అన్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు.
 ఇదీ పరిస్థితి
 1983లో నిర్మించిన కేఆర్ స్టేడియంలో 17 వేల మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత ఇండోర్ స్టేడియం నిర్మించారు. తర్వాత పట్టించుకోవటం మానేయటంతో గ్యాలరీలోని సిమెంట్ కట్టడాలు శిథిలమై కూలిపోతున్నాయి. స్టేడియాన్ని ఆధునికీకరించాలని డిమాండ్లు ఎక్కువవటంతో నాలుగేళ్ల క్రితం అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచన మేరకు ఆధునికీకరణ పనులకు సుమారు రూ.17 కోట్లు అవసరమని అంచనా వేశారు. తర్వాత దీనిని రూ.12 కోట్లకు కుదించారు. తాజాగా రూ.10 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం వుడా అనుమతి తీసుకున్నారు. తర్వాత మైదానం లోని మటి ్టశాంపిళ్లను సైతం సేకరించటంతో పనులు జరగటం ఖాయమని క్రీడాసంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు ఎంతో సంతోషించారు. తర్వాత  ఈ ప్రతిపాదన తెరవెనక్కి వెళ్లిపోయింది. నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం తెరపైకి వచ్చింది.
 మరమ్మతులతో సరి
 9 నెలల క్రితం జెడ్పీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించటంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉన్న భవనానికి మరమ్మతులు చేపట్టారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులకు ఫ్లడ్‌లైట్లు అమర్చారు. ఇండోర్ స్టేడియంపైకప్పు వేయించారు. తాజాగా మరో రూ.20 లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పటంతో ఇప్పట్లో ఆధునికీకరణ లేనట్టేనని అందరూ భావిస్తున్నారు.
 ప్లాన్‌లో లోపాల వల్లే జాప్యం
 ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్లాన్‌లో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నందువల్లే జాప్యం జరుగుతోందని డీఎస్‌డీవో ఎల్.దేవానందం చెప్పారు. కలెక్టర్ సూచన మేరకు కొత్త ప్లాన్‌ను ఉన్నతాధికారులకు పంపామని వెల్లడించారు. స్టేడియం ఆధునికీకరణను రూ.10 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారని, ఇందులో రూ.5 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ, రూ.5 కోట్లు వుడా అందజేయనున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement