చంద్రబాబును కేంద్రం ఉపేక్షిస్తుందా? | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కేంద్రం ఉపేక్షిస్తుందా?

Published Wed, May 28 2014 4:30 PM

వాసిరెడ్డి పద్మ - Sakshi

హైదరాబాద్: నల్లధనం విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షిస్తుందా? అన్న అనుమానాన్ని  వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవాడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు  చెప్పారు.

హసన్ అలీ ఖాన్ అనే వ్యక్తి  ఏపికి చెందిన ఒక మాజీ సిఎం ద్వారా విదేశాలకు డబ్బు పంపినట్లు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన వ్యక్తి కాదు, జీవించి ఉన్న వ్యక్తని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. వేల కోట్ల రూపాయలు ఆయన తరలించినట్లు హసన్ అలీ తన డైరీలో రాసుకున్నారు. కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కుంభకోణం కేసులో పూణే స్టడ్ ఫామ్ యజమాని హసన్ అలీ ఖాన్‌ను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.  2011లో ఈ విషయాన్ని జాతీయ పత్రికలు రాసినట్లు తెలిపారు.

హసన్ అలీ చెప్పిన విషయాలపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు విదేశాలలో దాచిన నల్ల ధనాన్ని వెలికి తీస్తే రైతుల రుణాలు ఒకసారికాదు, పది సార్లు రద్దు చేయవచ్చని ఆమె అన్నారు. ఈ అంశంపై  ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్టీఏలో భాగస్వామి అనే కారణంతో చంద్రబాబును వదల కూడదని ఆమె అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ని విమర్శించడం లోకేష్కు, టిడిపి నేతలకు తగదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement