‘దేశం’ నేతలకు కొత్త తలనొప్పి | Sakshi
Sakshi News home page

‘దేశం’ నేతలకు కొత్త తలనొప్పి

Published Wed, Dec 10 2014 12:52 AM

‘దేశం’ నేతలకు కొత్త తలనొప్పి

 శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎన్నిక.. తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో దిగేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఇద్దరూ టీడీపీ మద్దతు తమకంటే తమకేనంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉండడంతో ఏం జరుగుతుందోనని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశం ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసన మండలిలో టీడీపీ విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన మరో అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ వర్గాలను సమీకరించుకునే వ్యూహాల్లో బిజీ అయ్యారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు, తన కుమారుడు రవికిరణ్‌వర్మ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగినప్పుడు తమ విజయం వెనుక క్రియాశీలక పాత్ర పోషించిన వర్గాలను కూడగట్టే పనిలో చైతన్యరాజు ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అవార్డులు లభించిన ఉపాధ్యాయులకు అమలాపురం కిమ్స్, కాకినాడ ప్రతాప్ నగర్‌లోని చైతన్య కాలేజీ, రాజానగరం గైట్ కళాశాలల్లో పెద్ద ఎత్తున సత్కారాలు కూడా నిర్వహించారు.
 
 గతంలో రాజ్యసభ సభ్యత్వంపై మాట ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం ఆనక వెనకడుగు వేసిందని, అయినప్పటికీ తాను మద్దతు ఇచ్చానని, అందువల్ల ఎమ్మెల్సీ బరిలో ఆ పార్టీ మద్దతు తనకే లభిస్తుందని చైతన్యరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసన మండలిలో పార్టీ విప్ కూడా కావడంతో చైతన్యరాజుకు మద్దతు విషయంలో టీడీపీ అధినేతకు మరో ఆలోచన లేదని ఆయన వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలు తన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నాయని, పార్టీ అధికారంలో ఉండటంతో ఉపాధ్యాయ డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి ఉంటుందని, అందువల్ల తనకే ఎక్కువ అవకాశాలున్నాయని చైతన్యరాజు చెబుతున్నారు.
 
 చైతన్యరాజుతో పాటు ప్రగతి విద్యాసంస్థల అధిపతి పరుచూరి కృష్ణారావు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పెద్దాపురం సీటు కోసం ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. సీటు ఖాయమన్న భరోసాతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, భారీ బ్యానర్లతో ప్రచారం కూడా చేసుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో చివరి నిమిషంలో పెద్దాపురం టిక్కెట్టు నిమ్మకాయల చినరాజప్పకు దక్కడం, ఆనక ఆయన డిప్యూటీ సీఎం, హోం మంత్రి కావడం తెలిసిందే. ఆ సమయంలో కొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినా కృష్ణారావు పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని సహచరులు చెబుతున్నారు. పార్టీ మద్దతు తనకు లభిస్తుందన్న నమ్మకంతోనే ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
 
  సొంత సామాజికవర్గ నేతల మద్దతుతో చంద్రబాబును ఏదో విధంగా ఒప్పిస్తామని కృష్ణారావు సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రం చైతన్యరాజు వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాంలో చైతన్యరాజు టీడీపీలో తెరవెనుక క్రియాశీలకంగా ఉన్నారు. ఆ సమయంలో యనమల, రాజప్పతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు కలసివస్తుందని అంటున్నారు. కృష్ణారావుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సి వస్తే పెద్దాపురంలో కొరివితో తలగోక్కోవడమే అవుతుందని రాజప్ప వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చైతన్యరాజు, కృష్ణారావు చేస్తున్న ప్రయత్నాలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి.
 

Advertisement
Advertisement