ఏడుపిస్తున్న సీట్లు | Sakshi
Sakshi News home page

ఏడుపిస్తున్న సీట్లు

Published Thu, Apr 10 2014 12:39 AM

ఏడుపిస్తున్న సీట్లు - Sakshi

  •     ఆరింటికి టీడీపీ అభ్యర్థులు ఖరారు
  •      ఏడు చోట్ల ఎంపిక అసలైన సవాల్
  •      అయోమయంగా పంచకర్ల భవితవ్యం
  •      గంటా తాజా ప్రతిపాదనతో నిరసనలు
  •      నేటి జాబితాయే కీలకం
  •   సాక్షి, విశాఖపట్నం : అభ్యర్థుల ఎంపిక టీడీపీని గందరగోళంలోకి నెట్టింది. పేర్లు ప్రకటిస్తే అసంతృప్తులు భగ్గుమంటారనే భయం నెలకొంది. అందుకే బుధవారం వివాదాల్లేని ఆరుచోట్ల అభ్యర్థులను ప్రకటించింది. వెలగపూడి(తూర్పు), రామానాయుడు(మాడుగుల), కేఎస్‌ఎన్ రాజు(చోడవరం), అయ్యన్న(నర్సీపట్నం), బండారు సత్యనారాయణమూర్తి(పెందుర్తి)ల పేర్లను ఖరారు చేసింది. రెండు సీట్లు బీజేపీకి కేటాయించగా ఇప్పుడు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది.

    ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న గంటా శ్రీనివాసరావుతోపాటు పంచకర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. తొలుత పంచకర్ల ఉత్తరం సీటు ఆశించగా పొత్తులో బీజేపీకి వెళ్లింది. పెందుర్తి స్థానం ఇస్తారని భావిస్తే తాజా జాబితాలో అక్కడ బండారును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పంచకర్ల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చేసేది లేక అనకాపల్లి వెళ్లాల్సి వచ్చేలా ఉంది.  
     
    గంటా బృందం పరిస్థితి అటూ ఇటూ..
     
    అనకాపల్లిలో ఓటమి భయంతో గంటా భీమిలి నుంచి పోటీచేసేందుకు  ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కూడా  పోటీకి పైరవీలు చేసుకుంటున్నారు. సకురు రఘువీర్, అప్పల నరసింహరాజు తదితరులు ఇప్పటికే పార్టీ బలోపేతం పేరుతో భారీగా ఖర్చుచేశారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి (సిట్టింగ్ ఎమ్మెల్యే) అవంతికి టికెటిస్తే ఓడిపోతారని పార్టీ సర్వేలో తేలడంతో ఇప్పుడాయన్ను  అనకాపల్లి లోక్‌సభకు గంటా ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది.

    అనకాపల్లి ఎమ్మెల్యేగా తన బృంద సభ్యుడైన పంచకర్ల పేరును తాజాగా గంటా సూచిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే స్థానికంగా ఆయా స్థానాల్లో చాలాకాలంగా పాతుకుపోయి పనిచేసుకుంటున్న టీడీపీ నేతల్లో అసమ్మతి పెల్లుబుకుతుందనే భయం పార్టీ వర్గాలను వెంటాడుతోంది. విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌లు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతపూడికి టికెట్ హామీలేకపోవడంతో కోన తాతారావు, పల్లా శ్రీనివాస్‌లు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు.
     
    పాయకరావుపేటలో ఇన్‌చార్జి అనితకు వ్యతిరేకంగా క్యాడర్ నిప్పులు కక్కుతోంది. యలమంచిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు, సుందరపు విజయ్‌కుమార్, పప్పల చలపతిరావు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరూ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. అరకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు కాకుండా కుంభా రవిబాబుకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇదే జరిగితే అరకు నిరసనాగ్ని సెగలు రేగడం ఖాయమంటున్నారు.

    ఇలా ఏడు నియోజక వర్గాల్లో రకరకాల తలనొప్పులు పార్టీని వేధిస్తున్నాయి. గురువారం విడుదల చేయబోయే మలివిడత జాబితాలో దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. ఈ సీట్ల ప్రకటన తర్వాత చాలా నియోజక వర్గాల్లో పార్టీకి అసమ్మతి సెగలు తీవ్రమవనున్నాయి. సీటురాని వారిలో చాలామంది రెబల్ అభ్యర్థులుగా సైతం రంగంలోకి దిగడానికి నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు.
     

Advertisement
Advertisement