బాబూ.. ఇదేం న్యాయం! | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇదేం న్యాయం!

Published Sun, Mar 22 2015 3:22 AM

Is justice .. watch!

సాక్షి, కడప : ప్రభుత్వానికి ఏ రూపంలో ఆదాయం వచ్చినా విడిచిపెట్టే పరిస్థితి  కనిపించడం లేదు. అది ఇంటి పన్నైనా...నీటి పన్నైనా.. ఇసుక, ఎర్రచందనం, తదితర వాటి ద్వారా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం చివరకు మహిళా సంఘాలను సైతం వదిలిపెట్టలేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం మాఫీ మాటను మరిచిపోయి ఆదాయంపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు మరింత మేలు చేస్తానని పేర్కొన్న బాబు... కనీసం రూ. 10 వేలు రుణమాఫీ కూడా చేయకపోగా డ్వాక్రా రుణాలపై సేవా పన్ను విధించేందుకు సిద్ధమవుతున్నారు. డ్వాక్రా బృందం తీసుకున్న మొత్తంలో ఒక శాతం చొప్పున సేవా పన్ను విధించేందుకు సిద్ధమవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఇచ్చేది బ్యాంకులు....చెల్లించేది గ్రూపులైతే పన్నులెందుకు?
జిల్లాలో సుమారు 35 వేల పైచిలుకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ పేదరిక నిర్మూలన పథకంతోపాటు పట్టణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. వీటికి సంబంధించి వివిధ బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల రుణాలు మహిళలు తీసుకున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 3404 గ్రూపులకు గాను రూ.7942.58 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 30 వేల గ్రూపులకు గాను రెండేళ్లుగా దాదాపు రూ. 500 కోట్లు రుణాలు ఇచ్చినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి.

అయితే, రుణాలు ఇచ్చేది బ్యాంకులు...వాటిని సక్రమంగా చెల్లించేది మహిళా గ్రూపులైనప్పుడు సేవా పన్ను  ఎందుకు చెల్లించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. సేవా పన్ను వసూలుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జీఓను కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా సాధికారత సంస్థను ఏర్పాటు చేసి సేవా పన్నుల వసూలు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా మహిళలకు మాత్రం భారం తప్పదు.
 
మహిళల్లో ఆగ్రహం..
అది చేస్తాం...ఇది చేస్తామంటూ ఇంతవరకు కాలం గడుపుతూ వచ్చిన ప్రభుత్వం తీరా డ్వాక్రా సంఘాలపై పన్నుల భారానికి తెర లేపడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయకున్నా ఫర్వాలేదు....ఇలాంటి భారం వద్దు మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పన్నులు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆందోళనకు ఉపక్రమిస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరిస్తున్నారు.
 
ఇప్పటికే వడ్డీ మీద వడ్డీలు కడుతున్నాం
ఇప్పటికే వడ్డీల మీద వడ్డీలు కట్టి అల్లాడి పోతున్నాం. మళ్లీ సేవా పన్ను పేరుతో ఇదేం వడ్డింపు. ఇలా అయితే రుణాలు తీసుకొనేవారే ఉండరు. మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు మాటమార్చారు. మళ్లీ ఇలాచేస్తే నమ్మేవారే ఉండరు. రుణాలపై వడ్డీ భారంతో మహిళలు సతమతమవుతున్నారు. ఇప్పుడు పన్ను వసూలు చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు.
పంబ మేరి (నీలాపురం, మైదుకూరు) మండల సమాఖ్య అధ్యక్షురాలు

Advertisement
Advertisement