ఇదో అనధికార పాలన! | Sakshi
Sakshi News home page

ఇదో అనధికార పాలన!

Published Tue, Feb 3 2015 1:29 AM

It is an informal rule!

జన్మభూమి కమిటీలదే పెత్తనం
కమిటీల వెనుక తెలుగు తమ్ముళ్ల హస్తం
అసంతృప్తిలో ప్రజాప్రతినిధులు


పలమనేరు: ప్రభుత్వ పథకాల అమలులో అనధికారిక పాలన సాగుతోంది. అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులను కాదని జన్మభూమి కమిటీల పేరిట ఈ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదు. ఈ కమిటీల వెనుక అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా చంద్రన్న రాజ్యంలో తెలుగు తమ్ముళ్లు లబ్ధి పొందేం దుకే ఈ తతంగమంతా సాగుతోందనేది పచ్చినిజం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అధికారులకు పూర్తి హోదా ఇవ్వకుండా నోడల్ వ్యవస్థను అమలు చేసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జన్మభూమి కమిటీల పేరిట వారికి పెత్తనమివ్వడం విమర్శలకు తావిస్తోంది.
 
ప్రతి పథకానికీ కమిటీలే కీలకం..


జన్మభూమి గ్రామసభల సందర్భంగా ప్రభుత్వం ఈ కమిటీలకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జన్మభూమి గ్రామసభల్లో అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పింఛన్ల తొలగింపు, చేర్పులు, రద్దు, కొత్త పింఛన్ల మంజూరులో వీరు సిఫారసు చేస్తే గానీ పనులు జరగని పరిస్థితి నెలకొంది. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులతో పాటు లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూర్చొబెట్టారు. ఇక రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి విచారణలు, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇలా ప్రతి అంశంలోనూ కమిటీ సభ్యులే కీలకంగా మారారు. అంతెందుకు ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వీరు పాల్గొనేలా ఆదేశించారు. దీనిద్వారా మంచికంటే చెడే ఎక్కువగా జరుగుతోంది.

కార్యకర్తల లబ్ధి కోసమే..

జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను, స్థానిక సంస్థలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. దీంతో అధికార పార్టీకి అండగా ఉంటూ తాము చెప్పిందే జరగాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీలోని కొందరు పింఛన్ల మంజూరులోనూ తమకు కావాల్సిన వారికే ప్రాధాన్యతనిచ్చారు. గ్రామాల్లో అయితే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న వారి పింఛన్లను కావాలనే తొలగిం చారు. సబ్సిడీ రుణాలనూ తమ పార్టీ కార్యకర్తలకే అందేలా చూశారు. ఇక రుణమాఫీలోనూ ప్రతి ఒక్కరూ వీరిని భ్రతిమలాడుకునే పరిస్థితి నెలకొంది. ఇంకొందరైతే లబ్ధిదారుల నుంచి మామూళ్లు కూడా వసూలు చేశారనే విమర్శలొస్తున్నాయి.
 
తెరవెనుక దేశం నాయకుల హస్తం


ప్రభుత్వ నిబంధనల మేరకు జేబీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్‌హెచ్‌జీ మహిళలు, సోషియల్ యాక్టివిస్ట్‌ల పేరిట కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో చాలామందికి కమిటీల గురించి అవగాహనే లేదు. కొందరికైతే సంతకం పెట్టడం కూడా సక్రమంగా రాదు. ఇలాంటి వారితో కమిటీలు ఏర్పాటు చేసి మొత్తం రాజకీయాన్ని అధికార పార్టీ నాయకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా పెట్టుకొనే ఈ తతంగమంతా సాగుతోంది. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు డమ్మీలుగా మారాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో నామమాత్రంగానే మారారు.
 
 

Advertisement
Advertisement