Sakshi News home page

ఐటీడీఏ పీవోగా వినయ్ చంద్

Published Wed, Oct 9 2013 3:41 AM

ITDA PO 's vinay chandh

 విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి :  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వి.వినయ్‌చంద్‌ను పాడేరు ఐటీడీఏ పీవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నరగా ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్న ఐటీడీఏకు మూడేళ్ల తర్వాత ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. 2008 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వినయ్‌చంద్ విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటారు. రాజకీయ  ఒత్తిళ్లను ఏ మాత్రం లెక్కచేయరనే పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలు సావధానంగా ఆలకించి మానవత్వంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గతేడాది డిసెంబరులో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌తో కలసి కీల కంగా పనిచేశారు.
 
  చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పని చేస్తూ పదోన్నతిపై 2012 ఏప్రిల్ 24న చిత్తూరు జేసీగా నియమితులయ్యారు. పౌరసరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టారు. చిత్తూరులోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లో చోటుచేసుకున్న రూ.1.62 కోట్లు కుంభకోణాన్ని బట్టబయలు చేసి గోడౌన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతలో తనదైన శైలిలో వ్యవహరించారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం కింద 9 రకాలైన నిత్యావసర సరుకుల పంపిణీని సమర్థంగా అమలుచేశారు. ఆధార్ విషయంలో కూడా రాష్ట్రంలో చిత్తూరు జిల్లాను ద్వితీయస్థానంలో నిలిపారు. మీ- సేవా కేంద్రాలను పటిష్టం చేయడంతోపాటు,రెవెన్యూ సేవలను సకాలంలో ప్రజలకు అందించేందుకు కృషి చేశారు. జేసీ కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాద కేసులను సైతం సమర్థంగా పరిష్కరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సాల్మన్‌ఆరోగ్యరాజ్, అక్కడే ట్రైనీకలెక్టర్‌గా పనిచేసిన  శ్వేతాటియోటియా నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా ఇప్పటికే  విశాఖ జిల్లాకు బదిలీ అయ్యారు. వీరి వెంటే వినయ్‌చంద్ కూడా ఇదే జిల్లాకు బదిలీ అయ్యారు.
 
 మూడేళ్ల తర్వాత ఐఏఎస్ : పాడేరు: రాష్ట్రంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిన పాడేరు ఐటీడీఏకు ఐఏఎస్‌ను ప్రాజెక్టుఅధికారి(పీవో)గా 37 నెలల తర్వాత ప్రభుత్వం నియమించింది. ఇన్నాళ్లూ గ్రూప్-వన్ అధికారులతోనే నెట్టుకొచ్చింది. ఐఏఎస్ ఉన్నంత కాలం ఏజెన్సీలో అభివృద్ధి పనులు చకచకా సాగిపోయేవి. నాన్ ఐఏఎస్‌లు ఆర్థిక అంశాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో కొన్ని అభివృద్ధి పనుల విషయంలో అవాంతరాలు తలెత్తేవి.  ఐటీడీఏ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ నిర్ణయంపైనే గ్రూప్-వన్ అధికారులు ఆధారపడాల్సిరావడమే ఇందుకు కారణం. 2010 ఏప్రిల్ 15న ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి కె.నిర్మల ఐదు నెలలు మాత్రమే పనిచేశారు. పాలక పక్షానికి సహకరించకపోవడంతో అనతి కాలంలోనే ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. అనంతరం జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన పోల భాస్కర్ 2010 సెప్టెంబర్ 17న ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా ఏడు రోజులే విధుల్లో ఉన్నారు.
 
  అనంతరం గ్రూప్-వన్ అధికారి ఏజేసీ కె.సత్యనారాయణను 2010 సెప్టెంబర్ 24న ప్రభుత్వం నియమించింది. మంత్రి బాలరాజు ముఖ్య అనుచరునిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పీవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన గ్రూప్-వన్ అధికారి  కె.శ్రీకాంత్‌ప్రభాకర్‌ను 2011 ఏప్రిల్ 28న నియమించింది. ఆయన నియామకంలో మంత్రి బాలరాజు కీలకంగా వ్యవహరించారు. అయితే గిరిజన సంక్షేమ కమిషనర్ సోమే్‌ష్‌కుమార్, గిరిజన మంత్రి బాలరాజుల మధ్య వివాదంతో శ్రీకాంత్‌ప్రభాకర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మంచి అధికారిగా గుర్తింపు పొందినప్పటికీ గిరిజన సంక్షేమ కమిషనర్ అతనిని మాతృసంస్థ అయిన జౌళిశాఖకు సరెండర్ చేశారు. దీంతో ఆయన 2012 నవంబర్ 20న రిలీవ్ అయ్యారు. అదే రోజు ఐఏఎస్ అయిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 ఏప్రిల్ 16వ తేదీ వరకు పనిచేసిన ఆయన స్థానంలో ఏజేసీ వై.నర్సింహరావును నియమించారు. ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమించకపోవడంతో ఏజెన్సీలో గిరిజన సంక్షేమం చతికిలపడింది. ఐఏఎస్‌ను నియమించాలంటూ ఏజెన్సీలోని అన్నివరాలు డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు 37 నెలల తర్వాత రెగ్యులర్ పీవోగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement