టీ బిల్లులో సవరణల కోసం ఢిల్లీకి | Sakshi
Sakshi News home page

టీ బిల్లులో సవరణల కోసం ఢిల్లీకి

Published Thu, Dec 12 2013 12:43 AM

టీ బిల్లులో సవరణల కోసం ఢిల్లీకి - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే దశలో ఎదురయ్యే కుట్రలను ఎదుర్కొనేందుకు తెలంగాణవాదులు సిద్ధంగా ఉండాలని జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల పోరాట ఫలమే కేంద్ర కేబినెట్ బిల్లు అని అభిప్రాయపడింది. బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల భవన్‌లో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు  హాజరయ్యారు.
 
 

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుత దశలో తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదని, అయితే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘కేంద్ర ముసాయిదా బిల్లును ఈ భేటీలో కూలంకషంగా చర్చించాం. తెలంగాణ ప్రజాప్రయోజనాలు నెరవేర్చేందుకు ఇందులో కొన్ని సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించాం. దేశంలోని మిగతా రాష్ట్రాలవలే ఎదిగేందుకు అడ్డుగా ఉన్న లోటుపాట్లను సరిచేస్తేనే పటిష్ట తెలంగాణ ఏర్పడుతుంది. మరో 1-2 రోజుల్లో బిల్లుకు మేం ప్రతిపాదించదలచుకున్న సవరణలు పూర్తిచేయనున్నాం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించాం.
 
 మా సవరణలను ఆయా పార్టీలకు సైతం అందజేస్తాం’ అని చెప్పారు. సమావేశంలో కె.గోవర్ధన్(సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ) జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, రఘు, అద్దంకి దయాకర్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. అవి....  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార ్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలి. ఇందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు కృషిచేయాలి.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించిన యూపీఏ ప్రభుత్వానికి, సహకరించిన కాంగ్రెస్‌కు, బీజేపీకి, ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.  
 
 ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం వెంటనే శాశ్వత ప్రాతిపదికన చర ్యలు తీసుకోవాలి. ఆదివాసీల సాంప్రదాయ పద్ధతుల్లో జాతర జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.  డీఎస్సీ-2012లో కామన్ మెరిట్‌లో ఎంపికైన అభ్యర్థులందరికీ భేషరతుగా వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేయాలి.   నల్లగొండ జిల్లాలోని రాచకొండలో నిర్మించ తలపెట్టిన ‘ఫీల్డ్‌ఫైరింగ్’ రేంజ్ ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.  ‘బాసర ట్రిపుల్ ఐటీ’ కళాశాలకు తెలంగాణ ప్రాంతానికి చెందినవారినే డెరైక్టర్‌గా నియమించాలి.  కుంటాల జలపాతంపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన లను విరమించుకోవాలి.
 
 ఎర్రబెల్లి, మోత్కుపల్లిలతో కోదండరాం భేటీ: టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులుతో కోదండరాం, ఇతర ముఖ్యనేతలు బుధవారం రాత్రి భేటీ అయ్యారు. టీ బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చల్లో సమర్థంగా వాణి వినిపించటంతోపాటు సహకారమందించాలని కోరారు. ఇందుకు టీడీపీ నేతలు సానుకూలంగా స్పందించారు. ‘బాబు, కేసీఆర్ ఇప్పటికీ మంచిమిత్రులే. వారు కలవాలనుకుంటే కలుస్తారు. మొన్న(2009లో) కలవలేదా?’ అని వారన్నారు.
 
 డిసెంబర్‌లో కాకుంటే జనవరిలో 

పార్లమెంటులో టీ బిల్లు ఆమోదంపై కేసీఆర్ ఆశాభావం
  పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఈ నెలలో కాకపోయినా జనవరిలోపు ఆమోదం పొందుతుందని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ కీలకం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న జాతీయ పరిస్థితులను గమనిస్తే వచ్చే ఎన్నికల తర్వాత అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చన్నారు. ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్న ప్రాంతీయపార్టీలకే బలం ఎక్కువగా ఉందని విశ్లేషించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయాలన్నా తమలాంటి(టీఆర్‌ఎస్) పార్టీల మద్దతే కీలకం అవుతుందన్నారు.
 

Advertisement
Advertisement