రైతులను ముంచిన ఈ పెద్దమనిషిని నిలదీద్దాం | Sakshi
Sakshi News home page

రైతులను ముంచిన ఈ పెద్దమనిషిని నిలదీద్దాం

Published Fri, Jan 12 2018 1:33 AM

jagan mohan reddy's praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి  
‘ఆ రోజు నేను మూడు వేల కోట్ల రూపాయలతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి పెడతానంటే.. అయితే తాను ఐదు వేల కోట్లతో పెడతానని ఈ పెద్దమనిషి అన్నాడు. మీరంతా గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇవాళ మనం వేసే ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తోందా? చంద్రబాబు రూ.ఐదు వేల కోట్లతో పెడతానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సి వస్తుందని వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారు.

తన హెరిటేజ్‌ సంస్థ లాభాల కోసం విజయా డెయిరీని మూయించాడు. ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేసిన ఈ పెద్దమనిషిని నిలదీద్దాం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 59వ రోజు గురువారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నెమలిగుంటపల్లిలో రైతుల ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమ్మేళనంలో జగన్‌  ఏం మాట్లాడారంటే..

కరువు, చంద్రబాబు కవలలు
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయనతో పాటు కరువు కూడా తోడుగా వచ్చింది. చిత్తూరు జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సిన పరిస్థితి. కరువు మండలాల కింద డిక్లేర్‌ చేస్తే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఏ రైతైనా ఆశిస్తాడు. అంటే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వస్తుందని. బ్యాంకులకు కట్టాల్సిన రుణాల వడ్డీలు మాఫీ అయిపోతాయేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తారు. కాని ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయలేదు. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందేమోనని మంత్రివర్గ సమావేశం పెట్టి కరువు మండలాలను కూడా ప్రకటించని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం.

నీళ్లకు.. పాలకు తేడా చెప్పిన ఓ అమ్మ
ఈ రోజు నా వద్దకు ఒక అమ్మ వచ్చింది. వస్తూ వస్తూ ఒక లీటరు పాలు, ఒక లీటరు నీళ్లు, బెల్లం ముద్ద తెచ్చింది. మొదట బెల్లం ముద్ద చూపించింది. ‘అన్నా.. మా జిల్లాలో పండే పంట ఇదేనన్నా.. నల్లగా ఉంటే మేమేమి చెయ్యమంటరన్నా.. ఇది నల్లగా ఉందని చంద్రబాబు ఆంక్షలు పెడుతున్నడు. కొనేవాళ్లు కరువయి పోయారు. మాకు గత్యంతరం లేక ప్రైవేట్‌ ఫ్యాక్టరీల్లో ఏరేటు చెబితే ఆ రేటుకు  చెరకును తోసేయా ల్సొస్తోందన్నా.. ఇలా అయితే బతికేదెలా అన్నా’ అని బాధపడింది.

‘అన్నా.. ఇది ఒక లీటరు నీళ్ల బాటిలన్నా.. దీని రేటు రూ.20. అన్నా.. ఇది లీటరు పాల బాటిల్‌. దీని రేటు రూ.22.   ఈ రోజు ఒక లీటరు నీళ్లు 20 రూపాయలు, ఒక లీటరు పాలు రూ.22 . ఎలా గిట్టుబాటవుతుం దన్నా.. ఎలా బతకాలన్నా’ అని అంటుంటే బాధనిపించింది. దగ్గరుండీ చంద్రబాబు ఏమి చేశారు. తన హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి పాలు కొనుగోలు చేసే దాంట్లో లాభాలు రావాలని పాల రేటు తగ్గించి, కో ఆపరేటివ్‌ రంగంలో ఉన్న చిత్తూరులోని విజయ డెయిరీని మూసేయించాడు. ఆ బాధలు భరించలేక రైతులు హెరిటేజ్‌కు పాలమ్మడం మొదలు పెట్టారు.

ముఖ్యమంత్రే దళారిగా మారి..
ఈ పెద్దమనిషి ఇంకో అడుగు ముందుకు వేసి హెరిటేజ్‌ ఫ్రెష్‌ షాపులు తెరిచాడు. ఆ షాపుల్లో కూరగాయలు అమ్మటం మొదలుపెట్టాడు. అంటే ఈయనే దగ్గరుండి మరీ దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం మొదలు పెట్టాడు. దీంతో రైతుల దగ్గర ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంటుంది. ఇదే దళారీల దగ్గరకు, చంద్రబాబు దుకాణం దగ్గరకు వెళ్లాక రేటు అమాంతం పెరిగి పోతుంది. ముఖ్యమంత్రి రైతుల గురించి ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడనేందుకు ఒక ఉదాహరణ ఏమిటంటే.. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లే.

ఈ మధ్య కాలంలోనే నేను పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రోజుకు కనీసం ఐదారుగురు రైతులు నాదగ్గరకొచ్చి ఈ ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. అప్లికేషన్‌ పెట్టి రెండు మూడేళ్లయిందన్నా.. ఇంతవరకు మాకు కరెంటు కనెక్షన్‌ ఇవ్వటం లేదన్నా.. అని వాపోతున్నారు. కరెంటు కనెక్షన్‌ ఇస్తే ఉచితంగా కరెంటు ఇవ్వాల్సి వస్తుందని ఎగరగొట్టే కార్యక్రమం జరుగుతోంది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సుల వల్ల మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అందరినీ ఆదుకుంటాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రైతుల కోసం ఇలా..
  మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌.
  గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. చిత్తూరు జిల్లా రైతులకు ఇంకొక మాట చెబుతున్నా.. నల్లబెల్లం మీద ఆంక్షలు పూర్తిగా తీసేస్తా.
  మనం అధికారంలోకి రాగానే చిత్తూరు డెయిరీ తెరిపిస్తాం. ప్రతి జిల్లాలో కో ఆపరేటివ్‌ రంగంలో పాలసేకరణ పెంచుతాం. డెయిరీకి పాలు పోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4 సబ్సిడీ ఇస్తాం.

Advertisement
Advertisement