జైలు నుంచే జగన్ ప్రజా ఉద్యమం: పి.గౌతమ్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

జైలు నుంచే జగన్ ప్రజా ఉద్యమం: పి.గౌతమ్‌రెడ్డి

Published Sun, Sep 1 2013 1:39 AM

Jagan taken up public movement from jail: Gowtham Reddy

విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చిన కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తోందని వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజల రాష్ట్రాన్ని సోనియాగాంధీ కేకు ముక్కలా కోసేసిందని ధ్వజమెత్తారు. కోట్లాదిమంది ప్రజల మనోగతంకన్నా కాంగ్రెస్ పార్టీకి నీచ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. జనహితమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ప్రజలకు సమన్యాయం చేయాలనే డిమాండ్‌తో పోరు సాగిస్తున్నామని చెప్పారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా ప్రజాసమస్యలపై పోరాటమే ఊపిరిగా ముందుకెళుతున్నారన్నారు. ఆయన జైల్లో సైతం ఉద్యమజ్వాల రగిలించిన పోరాట యోధుడని కొనియాడారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే, అది వైఎస్సార్ కుటుంబమేనన్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ముందుగా నడుంబిగించింది ఆ కుటుంబమేనని పేర్కొన్నారు.
 
ఉద్యమం నీరుగార్చేందుకు కుట్ర..


 టీడీపీ, కాంగ్రెస్‌లు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నుతున్నాయని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు సిద్ధమైన పార్టీలు ఇప్పుడు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆత్మగౌరవయాత్రకు రావడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని హితవు చెప్పారు.

 లగడపాటీ.. నీవెక్కడ?

 ఎంపీ లగడపాటి రాజగోపాల్ బఫూన్‌లా మారి సరికొత్త విన్యాసాలతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజంగా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే  సోనియా ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సూచించారు. పదవుల్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించడం తప్ప లగడపాటి ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. చివరికి ఆయన సమైక్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే లగడపాటి ముఖం చాటేసిన సంగతి ప్రజలు మరిచిపోరన్నారు.

Advertisement
Advertisement