జపాన్‌లో ఎన్‌ఈసీతో ఒప్పందం | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ఎన్‌ఈసీతో ఒప్పందం

Published Thu, Jul 9 2015 2:53 AM

జపాన్‌లో ఎన్‌ఈసీతో ఒప్పందం - Sakshi

 టోక్యోలో పర్యటించిన చంద్రబాబు
* గురువారం ఢిల్లీకి సీఎం  
* పలువురు కేంద్రమంత్రులతో భేటీ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎన్‌ఈసీ సంస్థ అంగీకరించింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు  నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమక్షంలో ఎన్‌ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మధ్య ఒప్పందం చేసుకుంది.

దీనిపై ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఎన్‌ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కొచిరో కొయిడే సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబు, జపాన్ మంత్రి యెసుజే టకజీ సమక్షంలో సంతకాలు చేశారు. జపాన్‌లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వా, ఎన్‌ఈసీ చైర్మన్ కౌరు యనో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు బృందం జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటుంది.

బాబు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ల అపాయింట్‌మెంట్లు కోరారు. లభించిన పక్షంలో వారితో సమావేశమై రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. లేనిపక్షంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు.
     
జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి టకజీతో బుధవారం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం  రెండుగంటలపాటు టోక్యోలో పర్యటించారు. షింబషీ  మెట్రో స్టేషన్ నుంచి షింటో యొసు స్టేషన్ వరకూ 29 నిమిషాల పాటు ఆయన రైలులో ప్రయాణించారు. అనంతరం 2020 ఒలింపిక్స్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు.
* జేజీసీ కార్పొరేషన్ చైర్మన్ మసాయుకితో జరిగిన సమావేశంలో పెట్రో కెమికల్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
* సుమిటొమి మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్‌తో చర్చల సందర్భంగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్, మోనో రైలుకు అయ్యే ఖర్చులో గల వ్యత్యాసాన్ని అధ్యయనం చేయాలనికోరారు.
*టోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా పనిచేయాలని కోరారు.
* హోండా కంపెనీ మోటార్ సైకిల్ ఆపరేషన్ సీవోవో షీంజీ ఆప్యమాతో భేటీ అయి ఏపీలో ఒక ప్లాంటును ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
* జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు తమ రాష్ర్టంలోని ఏడు నగరాల్లో వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement