ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్‌.. | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్‌..

Published Sat, Jul 1 2017 8:04 PM

ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్‌.. - Sakshi

► కేసులు, వేధింపులతో భయపెట్టే యత్నం
► పైలా నర్సింహయ్య విషయంలో జేసీపై తీవ్ర విమర్శలు
► ప్రభోదానంద ఆశ్రమ ఘటనలో  హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
► అసాంఘిక శక్తులకు జేసీ బ్రదర్స్‌ అండ!
► క్రమంగా దూరమవుతున్న కేడర్‌


జేసీ బ్రదర్స్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన నాయకులు రోడ్డెక్కి చేస్తున్న యాగీ నవ్వుల పాలవుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద వైఖరి అడ్డూఅదుపు లేని వ్యాఖ్యలతో వీరింతే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధినేత మెప్పు కోసం మైకందుకోగానే ప్రతిపక్షం పై నోరు  పారేసుకుంటున్న తీరు ఆ నేతల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది.

అనంతపురం: వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోట నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. సీరియస్‌గా చేస్తున్న ప్రసంగం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తారోనని ఎంతో ఆశతో వచ్చే ప్రజలు ఆ నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఇదీ ఇటీవల కాలంలో జేసీ బ్రదర్స్ తీరు. జేసీ దివాకర్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేసిన ప్రభాకర్‌ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న చాలా సందర్భాల్లో ఆయన వ్యవహారం ఇదే రీతిన ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఆయనను వారించాల్సింది పోయి.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో చెప్పకనే చెబుతోంది. తాజాగా విజయవాడ, వైజాగ్‌ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
దివాకర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్‌రోడ్డులో టెంటు వేసి విపక్షనేతపై దుర్భాషలాడారు. దీనిపై సోషియల్‌ మీడియాలో జేసీ బ్రదర్స్‌పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్‌ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రికి చెందిన పైలా నర్సింహయ్య అనే వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపీఆర్‌ ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంగా ఉండటంతో కోర్టు ఆదేశాలతో ‘అనంత’ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించాలని మహేశ్‌ అనే డాక్టర్‌ సిఫారసు చేశారు. అయినా సూపరింటెండెంట్‌ జగన్నాథం పైలాను రెఫర్‌ చేయలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్‌ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ రాజకీయనాయకుడు, తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్సకు సాయం చేయాల్సింది పోయి, ఇలా వ్యవహరించడమేంటని రాజకీయనేతలతో పాటు మేధావులు తప్పుబడుతున్నారు.

దీంతో పాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. ఇసుక వ్యవహారంలో వెంకటేశ్‌ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్‌రెడ్డిపై వెంకటేశ్‌ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దళితుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అసాంఘిక శక్తులకు అండగా?

జేసీ బ్రదర్స్‌ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పలుసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకోలేకపోయారు. దీనిపై తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పెద్దారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయింది. జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వాసులు ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నారు. అంతేకాక వేధింపులకు గురి చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ గంపన్న సోదరుడికి ఫోన్‌ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి సాక్ష్యమని.. బయటికి రాని బెదిరింపులు ఇలా చాలా ఉన్నాయనేది విపక్షాల వాదన. ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్‌ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement