నగల దుకాణాలే టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

నగల దుకాణాలే టార్గెట్‌

Published Sun, Jan 28 2018 1:29 PM

Jewelry store becomes target for thieves

అచ్చంపేట: దోపిడీ దొంగలు నగల దుకాణాలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. మండల కేంద్రమైన అచ్చంపేటలోని అలీ జ్యూయలరీలో గురువారం అర్ధరాత్రి కిలోన్నర బంగారం, 60 కిలోల వెండి వస్తువులు చోరీకి పాల్పడిన ఘటనలో కలకలం రేపుతోంది. గత నాలుగేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో స్థానిక గంగాభవానీ జ్యూయలరీలో భారీ చోరీ జరిగింది. ఈ రెండు చోరీలూ దాదాపు ఒకే విధంగా జరిగాయి. షాపు వెనుక భాగం నుంచి పైకప్పును తొలగించి లోపలికి చొరబడి, ఆనవాళ్లు కనబడకుండా ముందుగానే సీసీ కెమెరాల వైర్లు కట్‌ చేసి, కెమెరాలకు సంబంధించి హార్డ్‌ డిస్క్‌లను సైతం తమతో తీసుకుపోయారు.

గత కేసును ఛేదించడంలో పోలీస్‌ యంత్రాంగం సత్‌ ఫలితాన్ని సాధించలేకపోయింది. స్థానిక ఆంజనేయస్వామి విగ్రహ సెంటర్‌లో 24 గంటలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండడంతో పాటు ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నా, దొంగతనాలు జరగడం ప్రధాన చర్చనీయంశమైంది.

అప్పుడు గంగాభవానీ...
అచ్చంపేట మెయిన్‌ రోడ్డులోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న గంగాభవానీ జ్యూయలరీ షాపులో 2014, నవంబరు 29న జరిగిన దోపిడీలో మూడు కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. అప్పటి ధరల ప్రకారం వీటి విలువ సుమారు రు.80లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇది జరిగి నాలుగేళ్లయినా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు.

తాజాగా అలీ జ్యూయలరీలో..
నాలుగేళ్ల తరువాత అదే సెంటర్‌లోని అలీ జ్యూయలరీ షాపులో జరిగిన చోరీలో కిలోన్నర బంగారు ఆభరణాలు, 60 కిలోల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దుండగులు అప్పటి లాగానే దుకాణం వెనుక నుంచి లోనికి ప్రవేశించి, సీసీ కెమెరాల్లో ఆచూకీ కనిపించకుండా ముందుగానే వైర్లు కట్‌ చేసి హార్డ్‌ డిస్క్‌లను ఎత్తుకుపోయారు.

పాత నేరస్తుల పనేనా..?
తాజా ఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కదలి వచ్చింది. క్లూస్‌ టీమ్, డాగ్‌స్క్వౌడ్, క్రైమ్‌ ఎస్పీ, డీఎస్పీ, సీఐ, స్థానిక పోలీస్‌ సిబ్బంది కేసు శోధించే పనిలో రంగంలోకి దిగాయి. షాపులో వేలిముద్రలు, చోరీ జరిగిన తీరుపై బృందాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ప్రధాన కూడలిలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీస్‌ యంత్రాంగం ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమైంది. నగల దుకాణాల్లో కిలోల కొద్ది బంగారాన్ని షాపుల్లో ఉంచుతూ, వ్యాపారులు అశ్రద్ధగా ఉంటున్నారు అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు దొంగతనాల్లోనూ షాపు షట్టర్లుకు వేసిన తాళాలు వేసినట్లుగానే ఉంటున్నాయి. షాపు వెనుక నుంచి దొంగలు తమ పని చేసుకుపోయారు. ఎక్కడా ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో గంగాభవానీ జ్యూయలరీ షాపులో దోపిడీకి పాల్పడిన ముఠానే ఈ చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

క్లూస్, డాగ్‌ స్క్వౌడ్‌లకు సైతం ఆధారాలు దొరక్కకుండా పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఎక్కడ దొరక్కకుండా దొంగలు తమ పంథాను అనుసరిస్తున్నారు. పగటి వేళల్లో దుకాణాల్లో రెక్కీలు నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే అంత చాకచాక్యంగా పని ముగించేయడం చోరీల్లో ఆరి తేరిన దొంగలకే సాధ్యమని పోలీసులు భావిస్తున్నారు.   

చాలెంజ్‌గా తీసుకుంటున్నాం..
గతంలో కూడా ఇదే ఫక్కీలో దొంగతనం జరిగింది. ఈ సారి కచ్చితంగా దొంగతనాన్ని ఛేదిస్తాం. దీన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో పరిశోధన వేగవంతం చేస్తాం.  ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుని చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేస్తాం.
  – సీహెచ్‌ వెంకటప్పలనాయుడు, రూరల్‌ ఎస్పీ గుంటూరు

Advertisement
Advertisement