ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య

Published Sat, Sep 7 2013 6:24 AM

Job-seeker youth commits suicide

జన్నారం, న్యూస్‌లైన్ :  ప్రభుత్వ ఉద్యోగం రాదనే బెంగతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తపాలపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పొన్నం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తపాలపూర్ గ్రామానికి చెందిన గుంటుకు భరత్(24) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవని, భవిష్యత్ పాడవుతుందని కుటుంబ సభ్యులతో మదనపడేవాడు. మనస్తాపం చెందిన భరత్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి తల్లిదండ్రులు గంగన్న, భారతి, ఇద్దరు సోదరులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
 
 భార్య మందలించిందని భర్త..
 దండేపల్లి : మండలంలోని మాకులపేట, లక్ష్మీకాంతపూర్ గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాకులపేట గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీనివాస్(40) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. భార్యకు తెలియకుండా రూ.2వేలు అప్పు చేశాడు. మద్యంమత్తులో వాటిని పడేశాడు. కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక బాధపడుతుంటే తాగుడు మానకుండా అప్పు ఎందుకు చేశావని భార్య సత్తవ్వ అతడిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుం డగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఆయనకు భార్య సత్తవ్వ, కూతురు శ్రుతి ఉన్నారు.  
 
 తండ్రి మందలించాడని కొడుకు..
 మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామానికి చెందిన జెల్లపెల్లి స్వామి(22) గొర్రెలు మేపేందుకు వెళ్లకపోవడంతో తండ్రి లింగయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వామి గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి లక్సెట్టిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సమయంలో చనిపోయాడు. స్వామికి భార్య మల్లవ్వ, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ వివరించారు.
 
 జీవితంపై విరక్తితో..
 కుభీర్ : మండలంలోని బెల్గాం గ్రామానికి చెందిన ఆదేపువాడ్ శంకర్(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై టి.సంజీవ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌కు భార్యాపిల్లలు, అన్నదమ్ములు లేకపోవడంతో ఇతర గ్రామాల్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం చేనులో పురుగుల మందు తాగి చనిపోయాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
 చికిత్సకు డబ్బుల్లేక..
 ఆదిలాబాద్ రూరల్ : జైనథ్ మండలం రోడ్ మేడిగూడ గ్రామానికి చెందిన జె.ఆనంద్‌రావు(30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జైనథ్ ఏఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌రావు కొన్నేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. డబ్బులు లేకపోవడంతో రెండోసారి చికిత్సకు తీసుకెళ్లలేదు. దీంతో వ్యాధి తీవ్రం కావడం, చికిత్సకు డబ్బులు లేకపోవడంతో గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement