సన్నగిల్లుతున్న ఆశలు | Sakshi
Sakshi News home page

సన్నగిల్లుతున్న ఆశలు

Published Mon, Jun 23 2014 12:09 AM

సన్నగిల్లుతున్న ఆశలు - Sakshi

  •      రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన
  •      కోటయ్య కమిటీకీ గడువు కావాలనడంపై ఆగ్రహం
  •      ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల తంటాలు
  • రుణమాఫీ కథ కంచికి చేరేటట్టు కనిపించడం లేదు. అమలు విషయంలో కాలయాపనతో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి మోసం చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయిలను నగదు రూపేణా ప్రభుత్వమే చెల్లించాలని ఆర్‌బీఐ పేర్కొనడం, కోటయ్య కమిటీకి మరింత గడువు కావాలని ఆర్థిక మంత్రి ఆదివారం ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమలవుతుందో లేదోనన్న బెంగ పట్టి పీడిస్తోంది.
     
    చోడవరం/నర్సీపట్నం: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకులు అప్పులివ్వకపోగా ఉన్నవి తీర్చాలంటూ ఒత్తిడి చేయడం అన్నదాతలకు మింగుడు పడడం లేదు. మరోపక్క  మాఫీపై విధివిధానాల అధ్యయనానికి నియమించిన కోటయ్య కమిటీ నివేదికకు మరికొంత సమయం పడుతుందంటూ ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది.

    ఖరీఫ్ రుణాల కోసం బ్యాంకులను ఒప్పించే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2013-14 ఖరీఫ్, రబీల్లో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని ఇప్పటికే చెల్లించి, ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికి రుణాలు తీసుకోవా ల్సి ఉంది. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీ తో ఈ బకాయిలు పేరుకుపోయాయి. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే ఖరీఫ్ పనులు ప్రారంభించాలి. వరుణుడు ముఖం చాటేయడంతో వ్యవసాయపనులు పెద్దగా ప్రారంభం కాలేదు. కానీ అదను ముంచుకురావడంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్నారు.
     
    కమిటీ నివేదిక  పేరుతో మాఫీపై ప్రభుత్వం జాప్యం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క గతేడాది అప్పులు తీర్చాలంటూ కొన్ని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. నెలాఖరులోగా చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం కోటయ్య కమిటీ ఏర్పాటుకే పరిమితమయ్యారు.

    ఈ నేపథ్యంలో మాఫీ విధానంతో బ్యాంకులు ఆర్థికంగా నష్టపోతాయంటూ ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఈమేరకు ఈ నెల 11న ప్రభుత్వానికి లేఖ రాసింది. మాఫీ తప్పనిసరిగా అమలు చేయాలంటే బకాయిలను నగదు రూపంలో బ్యాంకులకు  చెల్లించాలంటూ అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఆర్థికస్థితి నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మాఫీ అమలు సాధ్యమా అన్న అనుమానాన్ని మేథావులు సైతం వ్యక్తం చేస్తున్నారు.
     
    రుణాలు మాఫీ చేయాలి
    నాది కె.కోటపాడుమండలం వారాడ సంతపాలెం. నాకు 3ఎకరాలు పొలం ఉంది. ఇందులో ఏటా వరి పంట వేస్తుంటాను. మదుపుల కోసం ఏపీజీవీబీలో రెండేళ్ల కింద రూ.50వేలు అప్పుతీసుకున్నాను. పంట కలిసిరాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాను. టీడీపీ రుణమాఫీ ప్రకటనతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా సమయం పడుతుందని మంత్రి ప్రకటించడం రైతులను మోసగించడమే. ఇలాంటి మాటలు కాకుండా వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి.     
     - వేచలపు సింహాద్రప్పడు, రైతు, వి.సంతపాలెం.
     
    మంత్రి ప్రకటనతో భయంగా ఉంది
    నాది చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామం. నాకు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చోడవరం ఆంధ్రాబ్యాంకులో రెండు తులాల బంగారు ఆభరణాలు గతేడాది కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుం దని ఎదురు చూస్తున్నాను. ఇంతలో బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. నెలాఖరులోగా అప్పు తీర్చకుంటే ఆభరణాలు వేలం వేస్తామంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో ఆందోళనకరంగా ఉంది.               
     - నానుబిల్లి అర్జునరావునాయుడు, రైతు, మైచర్లపాలెం.
     
    ప్రభుత్వం మోసం చేస్తోంది
    నాది దేవరాపల్లి మండలం కొత్తపెంట. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి,చెరకు పంటలు వేస్తున్నాను. గతేడాది కె.కోటపాడు స్టేట్‌బ్యాం క్‌లో ఆరు తులాల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పంట రుణంగా రూ.1.2లక్షలు తీసుకున్నాను. కోటయ్య కమిటీ నివేదికకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం రైతులను మోసం చేయడమే.    
     -రొంగలి వెంకట్రావు, రైతు, కొత్తపెంట.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement