బతుకు పయనం | Sakshi
Sakshi News home page

బతుకు పయనం

Published Wed, Oct 29 2014 1:40 AM

బతుకు పయనం - Sakshi

 భూగర్భ జలాలు ఇంకి పోయి పంట సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో సరైన పనులు లేక గ్రామీణ కూలీలు విలవిల్లాడుతున్నారు. భార్యపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కరువు రక్కసి తాకిడికి పెద్దా, సన్నకారు రైతులే తాళలేకపోతున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉన్న ఊరిని వదిలి పట్నం వైపు వలసపోతున్నారు.       
   - పెనుకొండ
 
 పెనుకొండ నియోజకవర్గంలో రైతులు, రైతు కూలీల వలసలు తీవ్రతరమయ్యాయి. ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి సొంత మండలం రొద్దంలోనే భారీగా గ్రామీణులు వలస వెళ్లారు. నిత్యం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు మూటాముల్లె సర్దుకుని బెంగళూరుకు వెళ్లేందుకు పెనుకొండ చేరుకుంటున్నారు. వారం రోజులుగా ఈ వలసలు మరీ ఎక్కువయ్కాయి. ఏనాడు గడప దాటి ఎరుగని మహిళలు సైతం కూలీనాలి చేసుకునేందుకు పట్నం బాట పట్టారు.

వీరిలో ఏ ఒక్కరిని కదిపినా వేదనాభరిత జీవితం ఆవిష్కృతమవుతోంది. కన్నీళ్లను దాచుకుని తాము పడుతున్న కష్టాలను వివరిస్తుంటే వినే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. అయితే పాలకుల హృదయాలు మాత్రం ఇందుకు అతీతంగా మారాయి. వారికి ప్రజా సమస్యల కన్నా, తమ సొంత వ్యవహారాలే ప్రధానమయ్యాయి. ఫలితంగా గ్రామీణుల వలసలు వారి కంటికి కనిపించడం లేదు.

 ఇక్కడే ఉంటే బువ్వ దొరకదు
 కంచి సముద్రం గ్రామానికి చెందిన వంద మంది ఒక్క రోజే వలస వెళ్లారు. బెంగళూరు, దొడ్డబళ్లాపురం, కోలారు, విజయపుర, చిక్కబళ్లాపురం, యలహంక, రాజన్నకుంట తదితర ప్రాంతాలకు వెళ్లి  కూలీ పనులు చేసుకోవడం ద్వారా పొట్ట పోసుకుంటామని వలస పోతున్న గ్రామీణులు తెలిపారు. గ్రామాల్లో ఉంటే బిడ్డలకు కనీసం బువ్వ కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు.

ఇక చదువులకు ఫీజులు, జబ్బు పడితే వైద్యానికి ఖర్చులు, కనీస అవసరాలకు డబ్బు ఎలా సర్దుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పిల్లాపాపలతో ఇళ్లకు తాళం వేసుకుని వెళ్లిపోతున్నామని మరో 20 రోజుల్లో తమ గ్రామంతో పాటు మండలంలోని అనేక గ్రామాల ప్రజలు పొట్ట చేతబట్టుకుని వలసకు  సిద్ధంగా ఉన్నారని కంచిసముద్రం వాసులు తెలిపారు.

 ప్రభుత్వం మోసం చేసింది
 రాష్ర్టంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గ్రామీణులు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేమని అన్నారు. కనీసం ఉపాధి హామీ పథకం పనులు కూడా ఆశించిన మేర జరగడం లేదని, దీంతో తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ చెప్పారు. ఈ ప్రజాప్రతినిధులను నమ్ముకుంటే ఆకలితో చావాల్సి వస్తుందని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతున్నామని యాదయ్య, పుల్లన్న, యల్లమ్మ, లక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
Advertisement