ఆదిత్యుని సన్నిధిలో పెళ్లిళ్లకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో పెళ్లిళ్లకు బ్రేక్

Published Tue, Aug 13 2013 6:31 AM

juxtapositions weddings Break in the arasavalli

అరసవల్లి, న్యూస్‌లైన్: భక్తడు: నమస్తే... నాపేరు బి.వెంకటేశ్వరావు. వచ్చేనెల 21న పెళ్లిచేసుకుంటున్నారు... స్వామివారిని సన్నిధిలో పెళ్లి చేయాలన్నది నా తల్లిదండ్రుల కోరిక. ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వరూ...
 
 ఆలయ సిబ్బంది: ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చని ఎవరు చెప్పారు. అలాంటి అవకాశమేదీ లేదే...
 భక్తుడు: అదేంటి సార్ మా అక్క పెళ్లి ఇక్కడే జరిగింది... నాకు తెలిసిన వారి పెళ్లిళ్లు చాలా జరిగాయి.
 
 ఆలయ సిబ్బంది: నీకెందుకయ్యా అవన్నీ... ఇక్కడ కొన్ని నెలలుగా పెళ్లిళ్లు ఆపేశాం. ఇక్కడ పెళ్లిళ్లు జరగవు చెప్పినప్పుడు విని వెళ్లిపోవాల్సిందే.
 
 భక్తుడు: కోపగించుకోవద్దు సార్... మొక్కు ఉంది కాస్త ఆలోచించరూ... పెళ్లి చేసుకోవడానికి అవసరమైన పత్రాలు, రేషన్ కార్డు, వీఆర్వో సంతకం చేసిన కాగితం, మా పెద్దలను కూడా తీసుకువచ్చా...
 
 ఆలయ సిబ్బంది: ఏమిటయ్యా నీ నస... ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో... మాకు పని ఉంది.
 
 భక్తుడు: అదేంటి సార్...ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేస్తే ఎలా... అడిగితే కోపగించుకుంటారెందుకు. అసలు ఎప్పటి నుంచి పెళ్లిళ్లు ఆపేశారు?
 
 ఆలయ సిబ్బంది: మా ఇష్టమయ్యా... ఈవో చెప్పారు, మేం ఆపేశాం అంతే...
 ఇదండీ అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో పరిస్థితి. దేశంలో నిత్యపూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయంలో ఒక్కటవ్వాలని ఎందరో భక్తులు కోరుకుంటారు. అయితే ఆలయ అధికారులు అనధికారికంగా పెళ్లిళ్లు నిలిపివేయడంతో భక్తులు మనస్తాపం చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే... అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద కల్యాణ మండపంలో దశాబ్దాలుగా పెళ్లిళ్లు జరుగుతుండేవి. అనివెట్టి మండపం నిర్మాణం, పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 2008లో పెళ్లిళ్ల వేదికను ఆదిత్య కాంప్లెక్స్‌లోకి మార్చారు. అయితే పెళ్లి వారికి భోజనాలు పెట్టడానికి స్థలం లేదని, కల్యాణ మండపం చిన్నదన్న సాకులు చూపించి తొమ్మిది నెలలుగా అనధికారికంగా ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంలేదు. గత నవంబర్‌లో బోర్డు సభ్యులు, ఈవో నిర్ణయం తీసుకుని ఆదిత్యుని సన్నిధిలో పెళ్లిళ్లు ఆపేశారు. ఈ విషయమై వారు సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
 
 ఇదీ జరగాలి...
 వాస్తవానికి ఇటువంటి నిర్ణయం ట్రస్టు బోర్డు సమావేశంలో తీసుకోవాలి. దానిపై భక్తుల అభిప్రాయాలు సేకరించాలి. ఆ తర్వాతే పాలక మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుని కమిషనర్‌కు నివేదిక పంపిచాలి. కానీ అవేవీ చేయకుండానే బోర్డు సభ్యులు, ఈవో కలిసి పెళ్లిళ్లను అనధికారికంగా నిలిపివేశారు. ఈ విషయమై భక్తులు మండిపడుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement