ఏమో గుర్రం ఎగురావచ్చు...హస్తినలోనే వాలా వచ్చు ! | Sakshi
Sakshi News home page

ఏమో గుర్రం ఎగురావచ్చు...హస్తినలోనే వాలా వచ్చు !

Published Sun, Jan 19 2014 1:58 AM

ఏమో గుర్రం ఎగురావచ్చు...హస్తినలోనే వాలా వచ్చు ! - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఖాయం అని చెబుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకుడొకరు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో హిందీ ట్యూషన్ చెప్పించుకుంటున్నారట. దానికీ...దీనికీ లింకేంటీ అనుకుంటున్నారా... ఆగండాగండి. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే అప్పుడు పార్టీ అధిష్టానం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారుతుంది. అలాంటి సందర్భాల్లో టీఆర్‌ఎస్ నుంచి ముఖ్యులను కొందరిని లోక్‌సభకు కూడా పంపించాలని కేసీఆర్ భావిస్తే... తప్పదు వెళ్లాల్సిందే కదా! అక్కడ కీలక వ్యవహారాలను చక్కదిద్దే పనిలో భాషాపరమైన సమస్యలు రావచ్చు. అలాంటి ఇబ్బందేమీ కలగకుండా చూసుకోవాలని కేసీఆర్‌బంధువైన ఆ నాయకుడు ఇప్పటి నుంచే ముందుచూపుతో ట్యూషన్ చెప్పించుకుంటున్నారట. కొంతకాలంగా ఇంటివద్ద గుట్టుచప్పుడు కాకుండా ఆయన హిందీ, ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పించుకోవడం  ఆ పార్టీలో హాట్‌టాపిక్ అయింది.

కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని అనుకుంటున్నారు..ఒకవేళ అసెంబ్లీకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా చేయొచ్చని అనుకుంటున్నప్పటికీ, పురిటిగడ్డ సిద్దిపేట అయితే చాలా భద్రంగా ఉంటుందన్న అభిప్రాయమూ ఉంది. ‘ఒకవేళ అక్కడి నుంచే పోటీ చేస్తే ప్రస్తుతం అక్కడినుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత ఎక్కడికైనా మారాల్సి ఉంటుంది. కారులో తెలంగాణలో షికార్లు కొట్టింది చాలు..ఢిల్లీలో షికార్లు కొట్టేందుకు లోక్‌సభకు వెళ్లమంటే పోటీ చేయాల్సిందే కదా ?. అలాగే, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సివస్తే అప్పుడు అధిష్టాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. అన్ని మెళకువలు ఉన్నప్పటికీ అక్కడ భాషా సమస్య రాకూడదు కదా ?. అందుకే.. ఎందుకైనా మంచిదని కేసీఆర్ సమీప బంధువు ఇప్పుడు తెలంగాణేతర కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు ట్యూటర్లను ఇంటికి పిలిపించుకుని మరీ హిందీ, ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పించుకుంటున్నారు’ అని పార్టీ నేతలు చెబుతున్నారు. కారులో ఢిల్లీ వెళ్లేందుకు ఎంతటి ముందుచూపో..


 

Advertisement
Advertisement