విభజనపై సుప్రీంకోర్టుకు: కె.రఘురామ కృష్ణంరాజు | Sakshi
Sakshi News home page

విభజనపై సుప్రీంకోర్టుకు: కె.రఘురామ కృష్ణంరాజు

Published Sat, Dec 7 2013 2:31 AM

విభజనపై సుప్రీంకోర్టుకు: కె.రఘురామ కృష్ణంరాజు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దీనిపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో చాలా చట్టవిరుద్ధమైన అంశాలున్నాయని వాటన్నింటినీ న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్లు చెప్పారు. ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని రఘురామకృష్ణంరాజు దుయ్యబట్టారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఆచరణకు సాధ్యం కాని అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు.
 
  ముఖ్యంగా 371 (డీ), 371 (ఈ) లకు సంబంధించిన అంశాలపై రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజార్టీతో పాటు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు తప్పనిసరి చేయాల్సి ఉంటుందన్నారు. అయితే కేంద్రం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అడ్డదారిలో ఆగమేఘాలపై విభజన చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాం గంలో ఉమ్మడి రాజధాని అనే పదం ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement