కమ్ముకుంటున్న కరువు మేఘాలు | Sakshi
Sakshi News home page

కమ్ముకుంటున్న కరువు మేఘాలు

Published Mon, Sep 29 2014 1:46 AM

కమ్ముకుంటున్న కరువు మేఘాలు

కర్నూలు(అగ్రికల్చర్):
 ఓవైపు పంటలు ఎండుతున్నాయి..మరోవైపు పశుగ్రాసం కొరత వేధిస్తోంది.. వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. వెరసి అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో దిక్కుతోచని అన్నదాతలు కరుణించు వరుణుడా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు..
 తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగా మార్చిన చంద్రబాబు నేడు తమది రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారు.  కమ్ముకున్న కరువు మేఘాలను మాత్రం చూడటం లేదు. జూన్‌తో మొదలైన ఖరీఫ్ ఈ నెలతో అంటే మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆలస్యంగా ఆగస్టు 22న మొదలైన వర్షాలు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, ఈ వాన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. సెప్టెంబర్ 2వ వారం నుంచి  మళ్లీ వర్షాలు బెట్టు చేయడం.. ఎండల తీవ్రత పెరగడంతో  పంటలు ఎండుముఖం పట్టాయి. కోడుమూరు, ప్యాపిలి, సి.బెళగల్, పత్తికొండ, తుగ్గలి, గోనెగండ్ల తదితర మండలాల్లో అంతంత మాత్రంగా వర్షాలు పడ్డాయి. ఇక్కడ   ఉన్న కొద్దిపాటి తేమ కూడా ప్రస్తుత ఎండతీవ్రతకు ఆవిరవుతోంది. దీంతో  పత్తి, మొక్కజొన్న, ఆముదం, కొర్ర వంటి పంటలు అడుగు మేర వరకే పెరుగుదల ఉంది.   జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా, ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగయ్యాయి. జిల్లా మొత్తం మీద జూన్ నుంచి సెప్టెంబర్ 27 వరకు 438.9 మి.మీ., సాధారణ వర్షపాతం కాగా 311.8 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదయింది. అంటే 29 శాతం తక్కువగా నమోదయింది. కేవలం రెండు మండలాల్లో మాత్రమే అధిక వర్షాలు పడగా, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం మేరకు వర్షాలు కురిశాయి. అంటే 41 మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ప్రభుత్వం మాత్రం కరువు గురించి ఇంతవరకు మాట మాత్రంగా కూడా స్పందించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 భారంగా మారనున్న పశుపోషణ
 మామూలుగా అయితే ఆగస్టు నుంచి కొండల్లో,  బీడు భూముల్లో పచ్చిక అభివృద్ధి చెందుతుంది. ఎద్దులు పశువులను మేపడానికి బయటికి తరలిస్తారు. ఖరీఫ్ ముగుస్తున్న అనేక మండలాల్లోని కొండలు, బీడు భూముల్లో పచ్చిక మొలవలేదంటే కరువు పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఇప్పటికి పశువులకు ఎండగడ్డినే వినియోగిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో వానలు పడినా చుక్కనీరు చేరని చెరువులు అనేకం ఉన్నాయి. కల్లూరు మండలం ఉల్లిందకొండ చెరువుకు ఇప్పటికీ చుక్కనీరు రాలేదు. ప్యాపిలి మండలంలోని చెరువులు, కుంటలన్నీ వెలవెలపోతున్నాయి. పశువులకు తాగడానికి కూడా నీరు కరువై రైతులకు పశుపోషణ పెనుభారంగా మారనుంది.


 

Advertisement
Advertisement