కందికుంట.. అక్రమాల పుట్ట! 

21 Sep, 2019 09:53 IST|Sakshi
బాధితులు డా.ప్రభాకర్‌నాయుడు సతీమణి  సరస్వతమ్మ, కుమారుడు పవన్‌కుమార్‌

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు

10 మంది అనుచరులపై కేసు నమోదు

సాక్షి, కదిరి(అనంతపురం): తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దందాలు, భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి సహకారంతో బాధితులు ఒక్కొక్కరు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కందికుంటతో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కందికుంట హిందూపురం రోడ్‌లో వీవర్స్‌ కాలనీ సమీపంలోని సర్వే నెం.70/3లో ఉన్న 3.04 ఎకరాల తమ భూమిని కాజేసి బినామీ పేర్లమీద తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకం కూడా చేయించుకున్నాడన్న బాధితురాల ఫిర్యాదుపై స్పందించిన కదిరి ఆర్‌డీఓ రామసుబ్బయ్య సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. ఈ వార్త కదిరి ప్రాంతంలో సంచలనంగా మారింది. 

అలాగే కందికుంట అనుచరుడు, రౌడీషీటర్‌ అయిన గూడూరు హరినాథ్‌ అలియాస్‌ పాల హరి తమ భూమిని కబ్జాచేసి రాతి కప్పులు నాటాడని రిటైర్డ్‌ డీసీటీఓ నరసింహులు, ఆయన సతీమణి ఆకుల జయమ్మ ఫిర్యాదు చేస్తే కదిరి తహసీల్దార్‌ మారుతి ప్రసాద్‌ రికార్డులను పరిశీలించి పాలహరి పొందిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేయడంతో పాటు బాధితురాలు తన ఆస్థిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆమెకు తగిన రక్షణ కల్పించాలని కూడా తహసీల్దార్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా కందికుంట అనుచరుడు, టీడీపీ పట్టణాధ్యక్షుడు అయిన అహ్మద్‌వలీ ఇంటి పట్టాల పేరుతో తమ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి తమను మోసగించారని భవన నిర్మాణ కార్మికులు రెండు రోజుల క్రితం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ 
2015 డిసెంబర్‌ 16న అనారోగ్యంతో మరణించిన తమ తండ్రి డా.ప్రభాకర్‌ నాయుడు అలియాస్‌ పాముల డాక్టర్‌ సంతకాన్ని కందికుంట అనుచరులు ఫోర్జరీ చేసి తమ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేశారని ఆయన కుమారుడు పవన్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తండ్రి చనిపోక ముందే తమకు విక్రయ అగ్రిమెంట్‌ చేయించారని ఫోర్జరీ సంతకాలతో పత్రాలు పుట్టించి జిల్లా కోర్టులో వ్యాజ్యం(ఓఎస్‌ నెం.66/2016 ) వేశారని దీనిపై తాము కోర్టుకు వాస్తవాలు తెలియజేయడంతో పాటు వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరడంతో వారు ఆ కేసును ఉపసంహరించుకున్నారని ఆ ఫిర్యాదులో తెలియజేశారు. తర్వాత తనతో పాటు తన తల్లిని చంపుతామని బెదిరించి బలవంతంగా తమ దగ్గర సంతకాలు తీసుకొని విక్రయ పత్రాలు సిద్ధం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. తమను బెదిరించి తమ ఆస్థిని కాజేసిన కందికుంట అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో బాధితుడు పవన్‌ పోలీసులను కోరారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


డా.ప్రభాకర్‌ నాయుడు అలియాస్‌ పాముల డాక్టర్‌ పొలం ఇదే.. 

చంపుతామని బెదిరించి.. 
తనతో పాటు తన తల్లిని చంపుతామని కందికుంట తన అనుచరుల ద్వారా బెదిరించి తమ భూమిని రిజిస్టర్‌ చేయించుకున్నారని పట్టణంలోని దేవాలయం వీధికి చెందిన దివంగత డా.ప్రభాకర్‌ నాయకుడు కుమారుడు పి.పవన్‌కుమార్‌ గురువారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు(క్రైం.నెం225/2019) నమోదు చేశారు. కందికుంట అనుచరులైన టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గూనివాండ్ల వసంత కుమారుడు గూనివాండ్ల చైతన్య, ఎన్‌పీ కుంట మండలం మేకలచెరువుకు చెందిన రమణ, గాండ్లపెంట మండలం కురుమామిడి ఆర్‌. శ్రీరాములు, నాగూరుపల్లి రమేష్‌బాబు, పట్టణంలోని సింహకోటకు చెందిన పి.శ్రీనివాసులు, అడపాలవీధికి చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి, పులివెందులకు చెందిన లింగాల ప్రసాద్‌రెడ్డి, గాండ్లపెంట మండలానికి చెందిన గాజుల సుజన, ఈమె భర్త గాజుల ప్రతాప్‌తో పాటు బెంగుళూరుకు చెందిన దీపక్‌ కృష్ణమూర్తిలపై ఐపీసీ సెక్షన్‌ 467, 468, 471, 506(2)తో పాటు రెడ్‌విత్‌ ఐపీసీ 34 కింద కేసు నమోదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా