సింహ గర్జనకు సిద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

సింహ గర్జనకు సిద్ధం కావాలి

Published Mon, Sep 12 2016 4:48 AM

సింహ గర్జనకు సిద్ధం కావాలి - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌ : సింహగర్జనకు కాపులు సిద్ధంగా ఉండాలని కాపు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన మోరంపూడి బార్లపూడి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు కార్యాచరణ కమిటీ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చడంలో కాలయాపన చేస్తూండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిమాండు నెరవేరే దిశగా ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
 
ముద్రగడ మాట్లాడుతూ, కాపు ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యులను ఎంతో అవమానించిందని పేర్కొంటూ కంటతడి పెట్టుకున్నారు. కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను బలోపేతం చేసుకోవాలని.. ఉద్యమానికి ఎప్పుడు పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. మంజునాథ కమిషన్‌  
ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఏవర్గానికీ అన్యాయం జరగకుండా గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలనే కోరుతున్నామన్నారు. ఇది కుల ఉద్యమం కాదని, సామాజిక ఉద్యమమని, హక్కుల కోసం పోరాడకపోతే భవిష్యత్తులో జాతి నష్టపోతుందని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులకు భయపడకుండా ఉద్యమానికి సన్నద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
 
వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల పెత్తనంతో కాపు కార్పొరేషన్‌ రుణాలు పచ్చా చొక్కాలకే పరిమితమవుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారన్నారు. సీఎం ఆయన సామాజికవర్గానికే న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే లక్ష్యంతో ఏ ఉద్యమం చేపట్టినా సిద్ధంగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను మాత్రమే జేఏసీలో నియమించాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, నరిశే సోమేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు.

ముద్రగడతోపాటు కాపునేతలను పొగుడుతూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాడిన పాట అందరినీ అలరించింది.  కాపు జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ ట్రైనింగ్‌ సెల్‌ చైర్మన్‌ రామినీడి మురళి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, బసవా ప్రభాకరరావు, కామన ప్రభాకరరావు, కలువకొలను తాతాజీ, సంగిశెట్టి అశోక్, నారాయణస్వామి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
రాజా చినబాబుకు సత్కారం
తుని కాపు ఐక్యగర్జనకు కొబ్బరితోట ఇచ్చిన రాజా చినబాబును ముద్రగడ పద్మనాభం, కాపునేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ, ముద్రగడ తనకు రాజకీయ గురువని ఆయన కోసం ఏదైనా చేస్తానని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చిన అనంతరం అదే కొబ్బరితోటలో ముద్రగడను ఘనంగా సత్కరిస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement