Sakshi News home page

కారెం శివాజీ నియామకం రద్దు

Published Sat, Nov 5 2016 3:21 AM

కారెం శివాజీ నియామకం రద్దు - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
తీర్పు అమలు వాయిదాకు తిరస్కృతి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకం విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివాజీ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ నియామకం చట్ట విరుద్ధమని పేర్కొంది. నియామకం ఎంతమాత్రం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగలేదంటూ తప్పుబట్టింది. ప్రభుత్వం తన ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమర్థత, నిజాయితీ ఉన్న, ఎస్సీ, ఎస్టీలకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తినే సంబంధిత కమిషన్ చైర్మన్‌గా నియమించాలని తెలిపింది. నియామకంలో పారదర్శకత పాటించాలని, ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల పేర్లను సూచించేందుకు సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. చైర్మన్‌గా నియమించే వారికి విశిష్ట వ్యక్తులకుండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవా? చూడాలంది. విశిష్ట వ్యక్తులు అంటే సామాన్యులకంటే అధికులే కాక, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కాబోయే వారికన్నా కూడా ఉన్నతులని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారించారు. తీర్పు వెలువరించిన తర్వాత శివాజీ తర ఫు న్యాయవాది స్పందిస్తూ.. అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును కొద్దికాలం పాటు నిలిపేయాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలను కారెం శివాజీ రద్దు చేసుకున్నారు.
 

Advertisement
Advertisement