Sakshi News home page

కర్ణాటక సరిహద్దులో విషాదం

Published Tue, Sep 9 2014 3:49 AM

కర్ణాటక సరిహద్దులో విషాదం

  •      కేఎస్ ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ
  •      14 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం
  •      కోలారు, బెంగళూరు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు
  •      మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు
  • పలమనేరు: పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ముల్‌బాగల్ సమీపంలోని కప్పలమడుగు, శ్రీరంగపురం గ్రామాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కేఎస్‌ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని విధంగా మారాయి. మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది.
     
    మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు..

    మృతుల్లో కోలారు జిల్లా గద్దేకల్లూరుకు చెందిన నా గేష్, బెంగళూరు కోడిహళ్లికి చెందిన నాగమణి, బెంగళూరు సిటీకి చెందిన నారాయణమ్మ, తుమ్‌కూరుకు చెందిన బస్సుడ్రైవర్ గంగాధరయ్య, ముల్‌బాగల్‌కు చెందిన విజయమ్మ, బెంగళూరుకు చెందిన భారతి బ్రహ్మచారి, కర్ణాటకకు చెందిన నితీష్‌కుమార్(2), ఆంధ్రాకు చెందిన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం చిక్కనపల్లెకు చెందిన రాజశేఖర్, పలమనేరు పట్టణానికి చెందిన లిఖిత్‌కుమార్ (3), శాంతాభాయి(55), తిరుపతికి చెందిన పార్వతమ్మ ఉన్నారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
     
    పలు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు..

    ఈ ప్రమాదంలో గాయపడిన 13 మందిని ముల్‌బాగల్, కోలార్, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన సోమశేఖర్, తుంకూరుకు చెందిన కేఎస్‌ఆర్టీసీ కండక్టర్ నరసింహరాజు, గౌరీబీదునూర్‌కు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యమాచారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.
     
    టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..

    బెంగళూరు వైపు వేగంగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా ఢీకొనడంతోనే ఇంత ఘోరం జరిగిందని తెలుస్తోంది. సింగిల్ రోడ్డుపై వస్తున్న బస్సు కుడివైపు పూర్తిగా దూసుకుపోయేలా లారీ ఢీకొంది.

    ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు..
     
    రోడ్డు ప్రమాద విషయం తెలియగానే డె ప్యూటీ కమిషనర్ రవి, కోలారు జిల్లా ఎస్పీ అజయ్ విలోరి, డీఎస్పీ సిద్ధ్దేశ్వర్, సీఐ కృష్ణప్ప, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ ప్ప, నంగిలి ఎస్‌ఐ అంబరేష్ గౌడ, ముల్‌బాగల్ ఎమ్మెల్యే మంజునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, పీడబ్ల్యూడీ విభాగానికి చెందిన పలువురు అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మృతుల కుటుంబాలకు కేఎస్‌ఆర్టీసీ రూ.2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
     

Advertisement

What’s your opinion

Advertisement