యథేచ్ఛగా కర్ణాటక జలచౌర్యం | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కర్ణాటక జలచౌర్యం

Published Wed, Aug 6 2014 12:10 AM

Karnataka indulged

కర్నూలు రూరల్: తుంగభద్ర బోర్డు అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నీటి వాటా కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. కృష్ణా ట్రిబ్యూనల్-1 అవార్డు ప్రకారం సమన్యాయాన్ని పాటించడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 1.85 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు పోటెత్తడంతో గత నెల 24వ తేదీ నుంచి 690 క్యూసెక్కులను ఎల్లెల్సీకి వదులుతున్నారు. అయితే అవి ఆంధ్ర సరిహద్దుకు వచ్చేటప్పటికి 329 క్యూసెక్కులకు పరిమితమవుతున్నాయి. కర్ణాటక రైతులు యథేచ్ఛగా జల చౌర్యానికి పాల్పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
 
 ఇదిలా ఉండగా వాటా ప్రకారం కర్ణాటక రాష్ట్ర ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వీటితోపాటు అనుమతులు లేకుండా మరో ఆరు వేల క్యూసెక్కులను అక్రమంగా తరలిస్తున్నారు. తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పాదన పేరుతో మరో రెండు వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుంటున్నారు. కర్ణాటక రైతులు ప్రస్తుతం నారుమళ్లు సాగుచేసుకుంటున్నారు. అక్కడి నేతల ఒత్తిళ్ల మేరకే టీబీ డ్యాం అధికారులు క్రమంగా నీటి విడుదలను పెంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా విడుదల చేసిన నీరు లెక్కలోకి వచ్చే అవకాశం లేదని.. దామాషా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించే కోటాలోకి పరిగణించబోరని జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 కేటాయింపులు ఇలా..
 
 కృష్ణా ట్రిబ్యూనల్-1 అవార్డు ప్రకారం..తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక రాష్ట్రానికి 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు  73.010 టీఎంసీలు కలుపుకుని మొత్తం 212 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కర్ణాటకలోని పవర్ కెనాల్, దిగువ కాల్వ(కుడిగట్టు), ఎగువ కాల్వ(కుడిగట్టు), రాయ బసవ చానల్స్, రివర్ అసిస్టెన్స్ టు వీఎన్‌సీ అండ్ ఆర్డీఎస్,  లెఫ్ట్ బ్యాంక్ మెయిన్ కెనాల్+ ఎగువ కాల్వ(ఎడమ గట్టు)లకు మొత్తం 138.99 టీఎంసీలు సరఫరా చేస్తున్నారు. మన రాష్ట్రంలోని దిగువ కాల్వ(కుడిగట్టు), ఎగువ కాల్వ(కుడిగట్టు), రివర్ అసిస్టెన్స్ టు ఆర్డీఎస్+కేసీ కెనాల్‌లకు కలుపుకుని మొత్తం 73.010 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంది.
 
 అయితే పూడికతో జలాశయం నిల్వ సామర్థ్యం 104 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ ఏడాది ఎగువ ప్రాంతంలో వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో నీటి లభ్యత 144 టీఎంసీలకు పెరగవచ్చని టీబీ బోర్డు అధికారులు అంచనా వేశారు. ఇందుకు లెక్కగట్టి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటిని విడుదల  చేయాల్సి ఉంది. అయితే కర్ణాటక నేతల ఒత్తిళ్లకు తలొగ్గి టీబీ బోర్డు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అనుమతులు లేకుండానే నీటిని విడుదల చేస్తున్నారు.
 

Advertisement
Advertisement