కేసీ ఆయకట్టుకు నీరేది? | Sakshi
Sakshi News home page

కేసీ ఆయకట్టుకు నీరేది?

Published Sat, Jan 3 2015 1:54 AM

కేసీ ఆయకట్టుకు నీరేది? - Sakshi

కర్నూలు(అర్బన్): కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నీటిని నమ్ముకొని సాగు చేసిన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ముఖ్యంగా నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని రైతులు ఈ నీటిని నమ్ముకొని పసుపు, మిర్చి పంటలను దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలు ఫిబ్రవరి నెలాఖరుకు చేతికొచ్చే అవకాశం వున్నా, అంతవరకు ఈ పంటలకు కేసీ ద్వారా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.

రాజోలిబండ డైవర్షన్ స్కీం దిగువ భాగం నుంచి విడుదలవుతున్న 450 క్యూసెక్కుల నీటితో పాటు సుంకేసులలోని నీటిని కలిపి మొత్తం 817 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు వదులుతున్నారు. ఈ నీటి విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఆ తర్వాత పంటలకు నీరందే పరిస్థితి లేదన్నమాట. దీంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. అయితే గత డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఆయకట్టుకు నీటిని అందించాల్సి వుందని సాగునీటిశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతోనే నీటిని విడుదల చేస్తున్నట్టు చెబుతున్నారు.

టీబీ డ్యామ్ నుంచి నీరు విడుదల కావాల్సిందే!
జిల్లాలోని ప్రజల తాగు, సాగు నీటి అవసరాలకు సంబంధించి టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు 6.50 టీఎంసీల నీరు విడుదల కావాల్సి వుంది. ఈ నీటిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని జిల్లా నీటి పారుదల శాఖ ఇంజనీర్లు ఒకటికి రెండు సార్లు లేఖలు రాసినా, నేటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

మరో రెండు రోజుల్లో టీబీ డ్యామ్ నుంచి నీరు విడుదల కాకుంటే ప్రస్తుతం కేసీ కింద సాగులో వున్న పంటలన్నీ ఎండి పోయే ప్రమాదం వుంది. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో వున్న 1.19 టీఎంసీల నీటిలో 0.19 టీఎంసీల నీటిని వాడుకున్నా, ఒక టీఎంసీ నీరు మాత్రం కర్నూలు నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు నిల్వ చేయక తప్పని పరిస్థితి వుంది.

అంటే మిగిలిన 0.19 టీఎంసీల నీరు మాత్రమే సాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది. ఈ నీరు కేవలం రెండు రోజులకే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. టీబీ డ్యామ్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల కాకుంటే జిల్లా రైతులకు తీవ్ర నష్టం తప్పదన్నమాట. అయితే, ఈ నీటిపై అనంత నేతలు కన్నేయడం కలవరపాటుకు గురిచేస్తోంది.

 జిల్లా నీటిపై ‘అనంత’ నేతల కన్ను...
 టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు రావాల్సిన నీటి వాటాపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కన్నేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి అనంతపురం జిల్లాకు మళ్లించుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. వాస్తవానికి బచావత్ అవార్డు ప్రకారం జిల్లాకు న్యాయంగా 6.5 టీఎంసీల నీటి వాటా రావాల్సింది.

ఈ వాటా నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించడం ఆ అవార్డు తీర్పునకు వ్యతిరేకం కూడా. అయినప్పటికీ అనంతపురం నేతల ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గే పరస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే కేసీ కెనాల్ నీటిని నమ్ముకొని పంటలు వేసిన జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కేసీకి నీరు బంద్ అయితే నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాలోని రైతులతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతులపై ఈ ప్రభావం తీవ్రంగా చూపనుంది.

Advertisement
Advertisement