కేసీఆర్ పరోక్ష సమైక్యవాది: జగ్గారెడ్డి | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పరోక్ష సమైక్యవాది: జగ్గారెడ్డి

Published Mon, Aug 19 2013 10:45 PM

కేసీఆర్ పరోక్ష సమైక్యవాది: జగ్గారెడ్డి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘నేను ఎప్పటికీ సమైక్యవాదినే.. నేను ప్రత్యక్ష సమైక్యవాదినైతే టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పరోక్షవాది. తెలంగాణ రావడం ఆయనకు ఇష్టం లేదు’ అని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను సందర్శించాలని కోరుతూ రాసిన లేఖను సోమవారం ఆయన విలేకరులకు విడుదల చేశారు.

తెలంగాణ ఏర్పాటైతే కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు రాజకీయ మనుగడ లేదని, అందుకే రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత కూడా ఉద్యమాలు, యాత్రలు అంటూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరుల ఆశయాలకు తగినట్టుగా రాష్ట్ర భవిష్యత్తులను తీర్చిదిద్దడానికి యూనివర్సిటీల విద్యార్థులతో చర్చించాలని ఆంటోని కమిటీకి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను సందర్శించి, ఉన్నత అర్హతలున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణకోసం అమరులైన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. ప్రతి అమరుని కుటుంబానికి ఉద్యోగంతో పాటు రెండెకరాల భూమిని ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనకోసం పోరాడిన విద్యార్థులకు పది సంవత్సరాల గరిష్ట వయసును సడలింపు చేయాలన్నారు.

విద్యార్హతలున బట్టి అసిస్టెంటు ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, సర్వీసు కమిషన్ల ద్వారా ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు. వారికి 500 గజాల ఇంటి స్థలాన్నివ్వాలని కోరారు. విద్యార్థుల పోరాటాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని, ఉద్యమ నాయకులకు చట్టసభల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement