అసెంబ్లీ బరిలో కేసీఆర్? | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ బరిలో కేసీఆర్?

Published Sat, Jan 18 2014 4:46 AM

అసెంబ్లీ బరిలో కేసీఆర్? - Sakshi

* మెదక్ లోక్‌సభ, గజ్వేల్ శాసనసభ సీట్లపై గురి?

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. 2004 ఎన్నికల్లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసిన ఆయన ఈసారి మా త్రం శాసనసభకు పోటీ చేయడంపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో  లోక్‌సభకూ పోటీ చేస్తారా అనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ, సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఆ తర్వాత సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా, అక్కడ జరిగిన ఉపఎన్నికలో హరీష్‌రావు గెలుపొందిన విషయం తెలిసిందే. 2009లో మాత్రం మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు గెలిచారు.  తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, కాంగ్రెస్‌తో అనుసరించాల్సిన వైఖరి వంటివాటిపై ఈ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభకు పోటీచేయాల్సి వస్తే మెదక్ జిల్లా గజ్వేల్ స్థానంపై కేసీఆర్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

లోక్‌సభా స్థానం కూడా  మెదక్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయి. కేసీఆర్ మేనల్లుడు టీ.హరీష్‌రావు (సిద్దిపేట), కుమారుడు కేటీఆర్ (సిరిసిల్ల) ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో కొనసాగాలని గతంలో కేటీఆర్ భావించారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల వీలు కాకపోవడంతో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పుడు కేటీఆర్ లోక్‌సభకే వెళ్లాలని  కోరుకుంటారా, లేక సిరిసిల్ల నుంచే అసెంబ్లీకే పోటీ చేస్తారా? అనేది తెలియదు.

వాచ్‌డాగ్‌గానే కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని టీఆర్‌ఎస్ ఆవిర్భావంలోనే కేసీఆర్ ప్రకటించారు. తెలం గాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత టీజేఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కూడా దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అని పునరుద్ఘాటించారు. పునర్నిర్మాణంలో వాచ్‌డాగ్‌లా పనిచేస్తానని, తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉంటానని స్పష్టంచేశారు.

వీటిని బట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతాడనే చర్చకు, ఇతర అనుమానాలకు ఆస్కారమే లేదు. మరి శాసనసభకే పోటీ చేయాలనే యోచనలో అంతరార్థం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తా, విలీనమా? హోరాహోరీ పోరా అనే అంశాలపై కేసీఆర్‌కు కూడా స్పష్టతలేదు. యూపీఏ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో రాకుంటే అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? అందుకే అటు లోక్‌సభకు, ఇటు శాసనసభకూ గెలిచి ఉంటే ఎన్నికల అనంతర పరిస్థితులు, అప్పటి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని అంటున్నారు.

Advertisement
Advertisement