డిప్యూటీ సీఎం ఇలాకాలో..కీలక పోస్టులు ఖాళీ! | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం ఇలాకాలో..కీలక పోస్టులు ఖాళీ!

Published Sun, Nov 10 2013 1:14 AM

key posts vacancies in deputy CM jurisdictions

 మునిపల్లి, న్యూస్‌లైన్:
 డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజక వర్గంలోని మునిపల్లి మండలంలో కీలకమైన శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఏళ్లతరబడి ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు సాఫీగా సాగక మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

 ఎంపీడీఓ సరోజిని రెండు నెలల క్రితం రిటైర్డ్ కావడంతో అప్పటి నుంచి రాయికోడ్ ఎంపీడీఓ వామన్‌రావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన సోమ, శుక్రవారాలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నా రు. మిగతా రోజుల్లో రాకపోవడంతో ఆయన చాంబర్ మూసి ఉంటుంది. పంచాయతీ రాజ్ ఏఈ మాణయ్య ఉద్యోగ విరమణ చేయడంతో ఈ పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. ఈఓపీఆర్డీ గంగాధర్ ఎనిమిది నెలల క్రితం బదిలీ కాగా ఇప్పటివరకు ఆయన స్థానం భర్తీ కాలేదు. ఎంఈఓ చంద్రమౌళి తొమ్మిది నెలల క్రితం ఉద్యోగ విరమణ గావించడంతో ఓ హెచ్‌ఎంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మునిపల్లి పీహెచ్‌సీలో పనిచేసే డాక్టర్ పూజ సుమారు తొమ్మిది నెలల క్రితం నిజామాబాద్ కు బదిలీ అయ్యారు. అప్పటినుంచి న్యాల్‌కల్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్నారు. 25 పంచాయతీలకు గాను కార్యదర్శులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
 మండల పరిషత్ కార్యాలయంలో టైపిస్ట్, ఆఫీస్ సబార్టినేట్, వాచ్‌మన్ పోస్టులు కూడా ఏళ్లతరబడి ఖాళీగానే ఉన్నాయి. కీలక శాఖల్లో ఇన్‌చార్జి అధికారులు ఉండడంతో వారు పని ఒత్తిడికి లోనవుతున్నారు. సదరు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహతోపాటు ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని వారు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement