మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు | Sakshi
Sakshi News home page

మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు

Published Sun, Mar 9 2014 9:04 AM

మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు - Sakshi

హైదరాబాద్‌లో చోరీకి గురైన కారు కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కుమారుడు కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా జిల్లాపై పడింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఎన్‌వీవీ ప్రసాద్ స్కోడా కంపెనీకి చెందిన సూపర్బ్ కారును గతేడాది మే 22న దస్‌పల్లా హోటల్ వద్ద పార్క్ చేసిన గంటలోపే మాయమైంది. పలు ప్రాంతాల్లో వెతికిన బాధితుడు మరునాడు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినా సరైన ఆధారాలు లభ్యం కాకపోపోవడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో హోటల్ సీసీ కెమెరాలను పరిశీలించి పలువురు అనుమానితులను విచారించారు. దీనిలో జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి కుమారుడు ‘ఆర్ ’ అక్షరంతో పేరుగల వ్యక్తితోపాటు అతడి ముగ్గురు మిత్రులు ఉన్నారు.
 
 మొదట ఎలాంటి ఆధారాలు లభ్యంకాకపోవడంతో అప్పుడు వదిలివేశారు. అయితే కేసును విచారిస్తున్న క్రమంలో కిరణ్ అనే వ్యక్తి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించిన సమయంలో ఈ విలువైన కారు విషయం బయటకు వచ్చింది. దీంతో మళ్లీ సీసీ కెమెరాలతోపాటు బయట ఉన్న మరిన్ని పుటేజీలు పరిశీలించిన సమయంలో జిల్లాకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే ఈ కారును చోరీచేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాగా.. వారిని మళ్లీ పిలిపించి వారి పద్ధతిలోనే విచారించారు.
 
 దీంతో కారు చోరీ చేయడంతోపాటు అమ్మగా వచ్చిన డబ్బులు జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం నలుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆ కారు జిల్లాలోనే ఉందని తెలియడంతో కరీంనగర్‌లో దాని ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఈ సమయంలోనే జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడి హస్తం ఉన్నట్లు బయటకు పొక్కింది.  గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ అధికారి కృషితోనే సదరు అధికారి కుమారుడు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కారు రికవరీ కాగానే నేడోరేపో వారిని అరెస్టు చూపే అవకాశాలున్నాయని తెలిసింది.
 

Advertisement
Advertisement