ఖాకీపై ఖద్దరు స్వారీ! | Sakshi
Sakshi News home page

ఖాకీపై ఖద్దరు స్వారీ!

Published Mon, Mar 30 2015 3:26 AM

Khaki riding lover of cricket!

జిల్లాలో పోలీసు వ్యవస్థను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు శాసిస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా చెలామణి అవుతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను తు.చ. తప్పక పాటిస్తూ కిందిస్థాయి అధికారులు నాయకుల సేవలో తరిస్తున్నారు.
 
సాక్షి ప్రతినిధి, కడప: చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. ఇవన్నీ పాలకులు నిత్యం వల్లించే నీతి వాక్యాలు. కానీ ఇక్కడ చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారింది. అన్యాయానికి గురైన వారికి అండగా నిలవాల్సిన యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అధికారపార్టీ దౌర్జన్యాకు పాల్పడుతుంటే చేష్టలుడిగి చూస్తుండిపోతోంది. పై మూడు ఘటనల్లో అధికారపార్టీ ప్రమేయం ఉండటంతో పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనడంలో సందేహం లేదు.
 
చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా కొందరు, అధికారపార్టీకి కాపాలాగా మరికొందరు వ్యవహరిస్తుండటంతో ప్రజాస్వామ్యం పరిహాసమవుతోంది. ముందుగా పోలీసుల చెంతకు చేరిన కొండాపురం సమస్యకు పరిష్కారం చూపకపోవడానికి కారణం సైతం అధికారపార్టీ ఒత్తిడేనని తెలుస్తోంది. కేసుల నమోదు, నిందితుల అరెస్టుల్లో సైతం ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే శాఖాపరంగా ఇచ్చిన పోస్టింగ్‌లను సైతం గంటల్లో తారుమారు చేయడం వెనుక కూడా అదృశ్యశక్తిగా అధికార పార్టీనే నిలుస్తోంది.
 
కక్షసాధింపులో పావులుగా..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో వారి రాజకీయ కక్ష సాధింపులకు పోలీసు యంత్రాంగం పావుగా ఉపయోగపడుతోంది.  అత్యున్నత అధికారుల నుంచి వస్తున్న ఆదేశాల కారణంగా కిందిస్థాయి సిబ్బంది ఏకపక్ష చర్యలకు బీజం వేస్తున్నారు. చట్టానికి లోబడి చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నా ప్రత్యర్థి పార్టీ వారైతే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయింది.

గ్రామ స్థాయి నాయకుడు మొదలుకుని ఎమ్మెల్యే స్థాయి వరకూ అవకాశం దొరికితే  వేధించేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగా పోలీసు యంత్రాంగాన్ని అనుకూలంగా మల్చుకొని ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నారు.  మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేల తనయులపై సైతం రౌడీషీట్ తెరవడమే ఇందుకు ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు.
 
రాజ్యమేలుతున్న అసాంఘికశక్తులు..
జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపుగా కనుమరుగైంది. ఆ స్థానంలో అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ప్రకృతి సంపదను ఓవైపు దోచుకుంటూనే మరోవైపు క్రికెట్ బెట్టింగ్స్, మట్కా నిర్వహణను పెంచి పోషిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన క్రికెట్ బుకీ నరసింహను అరెస్టు చేయకుండా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా అడ్డుకున్నారు. అసాంఘిక శక్తుల్ని నియంత్రించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన నాయకులు మోకాలొడ్డుతున్నారు. దాంతో చేష్టలుడిగి చూస్తుండి పోవాల్సిన దుస్థితి పోలీసుశాఖకు పట్టింది.

పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో కొందరు తెలుగుతమ్ముళ్ల నేతృత్వంలో మట్కా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మట్కాతో సంబంధాలున్న వారు పోలీసు చర్యలతో దూరంగా ఉండిపోగా, ప్రస్తుతం అధికారపార్టీ మద్దతుదారులే ఆ పాత్రను భర్తీ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్స్ నిర్వాహకులుగా సైతం వ్యవహరిస్తున్నారు. ఒంటిమిట్ట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లెకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే ప్రేక్షక పాత్రలో యంత్రాంగం ఉండిపోయింది. ఓవైపు విపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు, రౌడీషీట్లు తెరుస్తున్నా.. ఇంకోవైపు గిరిజనులపై దాడులు చేస్తున్నా అధికార యంత్రాంగం మిన్నకుండి పోతోంది.
 
పులివెందుల, పోరుమామిళ్లలో చోటుచేసుకున్న ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఖాకీలపై ఖద్దరు నాయకులు స్వారీ చేస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా చట్టం ముందు అందరూ సమానులే అన్న వాస్తవాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
కొండాపురం మండలంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక వర్గంపై రెండు కేసులు బనాయించి, అరెస్టు చేశారు. మరో వర్గంపై ఒకే ఒక్క కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. అందుకు అధికార పార్టీ ఒత్తిడే అసలు కారణంగా తెలుస్తోంది.
 
రుష్యేంద్రబాబు సంబేపల్లె ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను బదిలీ చేసి ఆ స్థానంలో జీవన్‌రెడ్డికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చారు. ఆ మేరకు ఎస్‌ఐ జీవన్‌రెడ్డి సంబేపల్లె పోలీసుస్టేషన్‌లో విధుల్లో చేరారు. సాయంత్రం లోపే ఆ సీటును జీవన్‌రెడ్డి ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. తిరిగి రుష్యేంద్రబాబును సంబేపల్లె ఎస్‌ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాక్షాత్తు పోలీసుశాఖలో ఏర్పడిన వింతవైఖరిని చూసి అందరూ ముక్కున వేలేసుకోక తప్పలేదు.
 
ముద్దా బాబుల్‌రెడ్డి పులంపేట ఎంపీపీ. ఓ కేసులో కోర్టు వారెంట్ జారీ చేసింది. మరో కేసులో పోలీసుల అదుపులో ఉన్న బాబుల్‌రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం అనారోగ్యంతో రిమ్స్‌లో చేరారు. డిశ్చార్జి చేయగానే అరెస్టు చేయాలనే తలంపుతో నలుగురు ఎస్‌ఐ స్థాయి అధికారులకు నిఘా విధులు వేశారు. ఆ మేరకు రిమ్స్‌లో మఫ్టీలో ఒకరి తర్వాత మరొకరు సిబ్బందిని వెంటేసుకొని తచ్చాడుతూ వచ్చారు. గుండెజబ్బుతో ఉన్న బాబుల్‌రెడ్డిని వైద్యులు ఎప్పుడు డిశ్చార్జి చేస్తారా? అని ఎదురు చూశారు. ఎట్టకేలకు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పెపైచ్చు ఇంకో కేసు బనాయించేందుకు న్యాయసలహా తీసుకునే క్రమంలో ఓ ఉన్నతాధికారి తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement