Sakshi News home page

మైనింగ్ విశ్వవిద్యాలయంపైనా నీలినీడలు

Published Mon, Dec 16 2013 1:56 AM

khammam name missing to sanction  tribal unversities list

 ఖమ్మం, న్యూస్‌లైన్ :
 రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) ప్రతిపాదనల్లో ఖమ్మం పేరు లేకపోవడం జిల్లావాసులను నిరాశకు గురిచేసింది. గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కలగానే మిగలనుంది. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యామండలి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు పైనా నీలినీడలు అలుముకున్నాయి. అటు గిరిజన విశ్వవిద్యాలయం, ఇటు  మైనింగ్ యూనివర్సిటీ రెండూ జిల్లాకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమబాట పడుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని విధాలా అర్హత కలిగిన  జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంపై జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 పేదవాడికి పెద్ద చదువులు భారం కాకూడదని, అందరికీ అందుబాటులో విద్య ఉండాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు యూనివర్సిటీ నెలకొల్పాలని భావించడంతో పాటు పలు జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
 
  ఖమ్మం జిల్లాలో 46 మండలాలకు గాను 29 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా 8 లక్షల మందికి పైగా గిరిజనులు ఉన్నారు. గిరిజన జనాభా అధికంగా ఉన్నందున  జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, అపారమైన ఖనిజ సంపద ఉండటంతో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించారు. దీనిని సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించి, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై సంతృప్తి చెందిన ఉన్నత విద్యామండలి అధికారులు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరించారు. మహానేత మరణానంతరం ఈ విషయం మరుగున పడిపోయింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి పురంధేశ్వరి గిరిజన యూనివర్సిటీని విశాఖపట్నంలో నెలకొల్పేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ఢిల్లీలో  పావులు కదిపారు. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రికి, ఇతర అధికారులకు జిల్లాలోని విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు. యూనివర్సిటీని జిల్లాలోనే నెలకొల్పాలని వేడుకున్నారు.
 
 రూసా ప్రతిపాదనలో కనిపించని జిల్లా పేరు...
 రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) పథకం కింద రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాల్లో తొమ్మిది కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఉప కులపతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇందులో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్, విశాఖపట్నం జిల్లా పాడేరును ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా జిల్లాలోని కొత్తగూడెం లేదా ఒంగోలులోని ఏదో ఒక ప్రాంతంలో నెలకొల్పాలని  అభిప్రాయపడ్డారు. దీంతో జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు హుళక్కేనని, మైనింగ్ యూనివర్సిటీపై కూడా నీలినీడలు అలుముకున్నాయని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
 యూనివర్సిటీల ఏర్పాటు
 జిల్లా అనువైనది...
 మైనింగ్, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు ఖమ్మం జిల్లానే అనువైనదని విద్యావేత్తలు అంటున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 8 లక్షల మంది గిరిజనులు జిల్లాలో నివసిస్తున్నారు. అదే అదిలాబాద్‌లో 5 లక్షల మంది కూడా గిరిజనులు లేరు.
 
 జిల్లాలోని ఇల్లెందు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అటు వంరగల్ జిల్లా గిరిజనులకు కూడా అనుకూలంగా ఉంటుందని వారంటున్నారు. మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు కూడా ఒంగోలుతో పోలిస్తే మన జిల్లానే శ్రేయస్కరమని మైనింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలలో మైనింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఐటీ కోర్సులు బోధిస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, వీటి ఆధారంగా సింగరేణి, కేటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్, ఐటీసీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్, ఐరన్‌ఓర్, అబ్రకం, పాలరాయి. బాక్సైట్, డోలమైట్ మొదలగు ఖనిజాలు జిల్లాలో ఉన్నాయి. వీటితో మైనింగ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయి.
 
 ఆందోళన బాటలో విద్యార్థి సంఘాలు...
 జిల్లాలో మైనింగ్, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, వీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. యూనివర్సిటీల ఏర్పాటుకు అన్ని అర్హతలున్న ఈ జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు కుట్ర పన్నుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం విద్యార్థులకు నష్టం కలిగించవద్దని కోరుతున్నారు.

Advertisement
Advertisement