ఆక్రమణలపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై ఉక్కుపాదం

Published Mon, Jul 28 2014 2:47 AM

ఆక్రమణలపై ఉక్కుపాదం - Sakshi

సాక్షి, నెల్లూరు: అభివృద్ధి చెందుతున్న నెల్లూరులో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సహించేది లేదని, నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా రాజకీయాలకతీతంగా చర్యలు తప్పవని మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. రమేష్‌రెడ్డినగర్‌లో రవీంద్రభారతి విద్యాసంస్థ నిర్వాహకులు ఆక్రమించిన కార్పొరేషన్ పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్కూలు యాజమాన్యం అక్రమంగా నిర్మించిన ప్రహరీని మేయర్ దగ్గరుండి కూల్చివేయించారు. ఎవరు అక్రమనిర్మాణాలు చేపట్టినా ఇదే గతిపడుతుందని సంకేతాలిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రమేష్‌రెడ్డినగర్‌లో 89 సెంట్ల స్థలాన్ని కార్పొరేషన్ పార్కుకు కేటాయించింది. పార్కు నిర్మించకపోవడంతో పక్కనే ఉన్న స్కూల్ యాజమాన్యం ఆ స్థలంలో కొంత ఆక్రమించి ప్రహరీ నిర్మించింది.
 
 మిగిలిన స్థలాన్ని తమ స్కూలు బస్సుల పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటోంది. దీని పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ అధికారుల నుంచి స్పందన కరువైంది. వైఎస్సార్‌సీపీ నేత అబ్దుల్ అజీజ్ మేయర్ కావడంతో ఆక్రమణల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అజీజ్  ఆదివారం ఉదయం ఆరు గంటలకే కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి అధికారులందరినీ పిలిపించారు. అక్కడ అధికారులతో చర్చించిన అనంతరం వారితో కలిసి నేరుగా రమేష్‌రెడ్డి నగర్‌కు చేరుకున్నారు. ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసి స్థలాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియను మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షించారు.
 
 ఆక్రమణలు సహించం:
 నగరంలో ఆక్రమణలు సహించేది లేదని మేయర్ అబ్దుల్ అజీజ్ తేల్చి చెప్పారు. ఆక్రమణలు, అక్రమకట్టడాలు కొనసాగిస్తే నెల్లూరు అభివృద్ధి ఆగిపోతుందన్నారు. స్మార్ట్‌సిటీ లక్ష్యం నెరవేరదన్నారు.
 
 ఆక్రమించిన స్థలంలో నుంచి వైదొలగాలని స్కూలు యాజమాన్యానికి గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. ఈ స్థలంలో అందమైన పార్కు నిర్మిస్తామని చెప్పారు. కార్పొరేషన్ స్థలాలను కబ్జా చేసిన వారు తక్షణమే వాటిని వదిలిపెట్టాలన్నారు. లేకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మేయర్ సహకారంతో కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న స్థలంలో సుందరమైన పార్కు నిర్మాణానికి అందరం సహకరిస్తామని స్థానిక కార్పొరేటర్ రాజేష్ తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement