ఆయన ఎంపీ.. | Sakshi
Sakshi News home page

ఆయన ఎంపీ..

Published Mon, Dec 8 2014 2:38 AM

ఆయన ఎంపీ.. - Sakshi

ఆయన ఎంపీ.. అంటే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి. తన పరిధిలోని ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో మా ట్లాడి.. అవసరమైతే ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాల్సిన ఆయన.. కేంద్రం స్వయంగా ఇచ్చిన నిధులనే ఖర్చు చేయకుండా మురగబెట్టేస్తున్నారు. ఎంపీ కోటా కింద కేంద్రం విడుదల చేసిన రూ.2.50 కోట్లలో ఇప్పటివరకు ఆయన ప్రతిపాదించిన పనులు మూడంటే మూడే!.. అవి కూడా తన సొంత మండలానికే!!. వాటి విలువ రూ.12 లక్షలే. ఆయన మరెవరో కాదు..శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు.
 
 శ్రీకాకుళం : ఎన్నికైన ఆరు నెలల్లోనే ప్రజాప్రతినిధుల పనితీరును పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోవచ్చు. కానీ అందుబాటులో ఉన్న నిధులను సైతం ప్రజాసంక్షేమానికి సకాలంలో వినియోగించాలన్న ధ్యాస లేని ప్రజాప్రతినిధుల పనితీరుకు ఇంకే కొలమానమూ అక్కర్లేదేమో!. తమ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఎంపీలకు కేంద్రం ప్రతి ఏటా రూ.5 కోట్లు చొప్పున కేటాయిస్తుంది. ఎంపీ కోటాగా వ్యవహరిస్తున్న ఈ నిధులతో గ్రామాల్లో గుర్తించిన అత్యవసర పనులకు ఈ నిధులను మంజూరు చేసే స్వేచ్ఛ ఎంపీలకుంది. అదే క్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి గానూ తొలి విడతగా రూ.2.5   కోట్లు విడుదలయ్యాయి.
 
 దీనికి తోడు గత ఎంపీ, అప్పటి కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గ అభివృద్ది నిధులు ఖర్చు చేయకపోవడంతో రూ.1.5 కోట్లు మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం ఈ నిధులను కూడా ప్రస్తుత ఎంపీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన శ్రీకాకుళం ఎంపీ కోటాలో రూ. నాలుగు కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం రూ. 12 లక్షల విలువైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే ఎంపీ నుంచి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి అందాయి. తొలి విడత నిధుల్లో కనీసం 10 శాతం కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయని పరిస్థితుల్లో.. త్వరలోనే రెండో విడతగా మరో 2.5 కోట్లు రూపాయలు విడుదలైతే వీటిని ఎప్పటికి ఖర్చు చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
 సొంత మండలంపైనే మక్కువ
 ఇదిలా ఉండగా ఎంపీ పంపిన మూడు పనుల ప్రతిపాదనలు కూడా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలోనివే.. అవి కూడా ఆయన సొంత మండలానికి చెందినవే కావడం గమనార్హం. తన స్వగ్రామమైన నిమ్మాడలో కమ్యూనిటీ హా లు, కొత్తపేట జంక్షన్‌లో బస్‌షెల్టర్, కోటబొమ్మాళి మండలంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆయ న ప్రతిపాదనల్లో ఉన్నాయి. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సుమారు 19 లక్షల జనాభా ఉంది. వీరిలో 13 లక్షల మంది ఓటర్లు ఉన్నా రు. ఈ ఏడు సెగ్మెంట్లలోని దాదాపు ప్రతి గ్రామంలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపానుకు జిల్లా అంతా అతలాకుతలమైంది. ఇటువంటి తరుణంలో ఎంపీ తనకు అందుబాటులో ఉన్న రూ.4 కోట్లతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిధు లు కేటాయించి ఉంటే ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది. కానీ శ్రీకాకుళం ఎంపీ ఆ దిశగా ఆలోచించకపోగా.. చేసిన నామమాత్రపు ప్రతిపాదనలను సైతం తన సొంత మండలానికే పరిమితం చేయడం మిగా ప్రజలను, ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసే రూ.5 కోట్లను పూర్తిగా సద్వినియోగం చేస్తే గ్రామాల్లో చాలావరకు కనీస సౌకర్యాలు తీరిపోతాయి. ఇప్పటికైనా ఎంపీ నిధులను పూర్తిస్థాయిలో ని యోజక వర్గ అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుంది.
 

Advertisement
Advertisement