సీఎం కిరణ్ది పైకి సమైక్యం.. లోపల విభజన వాదం | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ది పైకి సమైక్యం.. లోపల విభజన వాదం

Published Mon, Oct 21 2013 3:08 PM

సీఎం కిరణ్ది పైకి సమైక్యం.. లోపల విభజన వాదం - Sakshi

రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరును స్వయంగా సీమాంధ్ర మంత్రులే తప్పుపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలను ఈ విషయంలో మభ్యపెట్టాలన్నదే ముఖ్యమంత్రి అసలు వ్యూహమని వారు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ తీర్మానం రాదని, ఒకవేళ వచ్చినా దాన్ని అసెంబ్లీలో ఓడించి తీరుతామని, అందుకే మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ రాజీనామా చేయొద్దని ఇన్నాళ్లూ కిరణ్ చెబుతూ వచ్చారు. కానీ అసలు తెలంగాణ బిల్లు లేదా తీర్మానం ఏది వచ్చినా దానిపై చర్చ ఉంటుంది తప్ప ఓటింగ్ అనేదే ఉండబోదని ఇప్పటికే స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది.

ఇంత జరిగినా కేవలం ప్రజల్లో సమైక్యవాదిగా ఇమేజి పెంచుకోడానికే సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారని, ఆయన అసలు ఎజెండా విభజన ప్రక్రియ సజావుగా సాగేలా చూడటమేనని కొందరు సీమాంధ్ర ప్రాంత మంత్రులు అంటున్నారు. 2014 సంవత్సరం లోపు రాష్ట్ర విభజన జరగదంటున్న సీఎం తీరును మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విభజన ముఖ్యమంత్రి చెప్పినవేవీ జరగడం లేదనేదన్నది వారి ఆరోపణ. వర్కింగ్‌ కమిటీ తెలంగాణ తీర్మానం చేశాక... అది పార్టీ నిర్ణయమే తప్ప ప్రభుత్వ విధానం కాదని సీఎం కిరణ్‌ వాదిస్తూ వచ్చారని, కానీ కేంద్ర కేబినెట్‌ తెలంగాణ నోట్‌ ఆమోదించడం,  అసెంబ్లీకి తెలంగాణ అంశం రెండు సార్లు వస్తుందని ముఖ్యమంత్రి చెప్పగా.. కాదు శాసనసభకు ముసాయిదా బిల్లు మాత్రమే వస్తుందని, తీర్మానం రాదని కేంద్ర హోం మంత్రి షిండే స్పష్టం చేశారని మంత్రులు గుర్తు చేస్తున్నారు.

విభజన ప్రక్రియ ఆపేందుకు 2009లో మాదిరిగా రాజీనామాలు చేద్దామన్న తమ ప్రతిపాదనను సీఎం కిరణ్‌ తిరస్కరించడం కూడా వ్యూహాత్మక తప్పిదమే అంటున్నారు సీమాంధ్ర మంత్రులు. అసెంబ్లీలో తెలంగాణ అంశాన్ని ఓడించేందుకు పదవుల్లో కొనసాగాలంటూ ముఖ్యమంత్రి సూచించారని...కానీ శాసనసభకు వచ్చే ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ ఉండదని కేవలం సభ్యుల అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారంటూ గ్రూప్‌ అఫ్‌ మినిస్టర్స్‌ స్పష్టత ఇస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఇపుడు ముసాయిదా బిల్లును అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే రాష్ట్రపతి దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని... అపుడు పార్లమెంట్‌లో ఆ బిల్లును ప్రవేశపెట్టడం సాధ్యం కాదంటున్న కిరణ్‌ వాదనతో కూడా మంత్రులు ఏకీభవించడం లేదు.
ఇలాంటి కారణాలు చూపుతూ రాష్ట్ర విభజన జరగదన్న సిఎం కిరణ్‌ తీరును పిసిసి చీఫ్‌ బొత్స వంటి కొందరు మంత్రులు తప్పుపడుతున్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రకు నష్టం జరగకుండా చూడాలే కానీ తాను సీఎంగా ఉన్నంతవరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ ప్రజలను మభ్యపెట్టడం సరికాదంటున్నారు. తెలంగాణ అంశంపై హై-కమాండ్‌ వద్ద జరిగిన కసరత్తులో ఆయన ఏనాడూ విభజనను వ్యతిరేకించలేదంటున్నారు. వర్కింగ్‌ కమిటీ జూలై 30న తీసుకున్న తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు ఉద్యమించడంతో  సమైక్యవాదుల దృష్టిలో విలన్‌ కాకూడదనే ఆలోచనతోనే సీఎం కిరణ్‌ యూ టర్న్‌ తీసుకున్నారనేది వారి ఆరోపణ. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు, సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తన ప్రభుత్వం పడిపోతుందనే ఆందోళనతోనే రాజీనామాలు వద్దంటూ కిరణ్‌ వారించారని గుర్తుచేస్తున్నారు. బయటికి సమైక్యాంధ్ర అంటున్న సీఎం కిరణ్‌.. లోలోపల మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి వీర విధేయుడిగా విభజన  ప్రక్రియకు సహకరిస్తున్నారనేది వారి ఫిర్యాదు.

Advertisement
Advertisement