రాజీనామాపై సీఎం మంతనాలు | Sakshi
Sakshi News home page

రాజీనామాపై సీఎం మంతనాలు

Published Mon, Feb 10 2014 1:56 AM

రాజీనామాపై  సీఎం మంతనాలు - Sakshi


  మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాలు కీలకంగా మారాయి. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం శాసనసభపైన పడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు, తెలంగాణ బిల్లు పరిణామాలకు సంబంధించి సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి పలువురు సీమాంధ్ర మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసే అంశంపైనా వారితో చర్చించినట్లు తెలిసింది.

కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కార్యాలయానికి చేరటం, ఆ వెంటనే ఆయన దానిపై సంతకం కూడా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు ఆదివారం రాత్రే సమాచారం అందింది. బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉందన్న సంకేతాలూ సీఎం వర్గీయులకు అందాయి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు రాజీనామా చేయాలా? లేకుంటే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించాక వైదొలగాలా? అన్న అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలో చర్చించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం శాసనసభ సమావేశం జరుగుతున్నందున బడ్జెట్ ఆమోదానికి ఆటంకం కలిగేలా సభానాయకుడిగా సీఎం రాజీనామా చేయటం సరికాదని అభిప్రాయపడినట్లు ఓ మంత్రి తెలిపారు. ఓటాన్ అకౌంట్ ఆమోదం పొందాక శాసనసభ వేదికగా సీఎం తన రాజీనామా ప్రకటన చేసే అవకాశముందని ఆ మంత్రి వివరించారు. ఇదిలావుంటే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ మంత్రుల నుంచి ఎదురయ్యే నిరసన గురించీ సీఎంతో భేటీలో చర్చించారు. తెలంగాణ నేతలు అసెంబ్లీలో నిరసనలకు దిగితే.. తిరస్కరణ తీర్మానం మాదిరిగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నూ మూజువాణి ఓటుతోనే ఆమోదింపచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
 
 కేబినెట్‌ను బహిష్కరిద్దాం: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లును తిరస్కరిస్తూ ప్రభుత్వం తరఫున  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో తీర్మానం చేయించటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ మంత్రులు.. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. గత సమావేశాల చివరి రోజున విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు సీఎం రూల్ 77 కింద తీర్మానం ఇవ్వటం.. దానికి మంత్రివర్గ ఆమోదం లేనందున చెల్లుబాటు కాదని, తిరస్కరించాలని రూల్ 81 కింద తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు స్పీకర్‌కు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. స్పీకర్ మాత్రం సీఎం తీర్మానాన్ని అనుమతించడమే కాకుండా సభలో గందరగోళం నెలకొని ఉన్నా.. తీర్మానాన్ని తానే చదివి మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించిన విషయమూ విదితమే.

దీనిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ మంత్రులు ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించటానికి సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం వేర్వేరుగా అంతర్గత చర్చలు సాగించారు. సోమవారం ఉదయం జరిగే మంత్రిమండలి సమావేశానికి వెళ్లకుండా ఆ భేటీ జరిగే గది ముందే బైఠాయించి నిరసనగా నినాదాలు చేయాలనే ఆలోచన చేశారు. శాసనసభలోనూ స్పీకర్ నాదెండ్లకు సహాయ నిరాకరణ చేయాలన్న వాదనా వచ్చింది. వీటిపై తెలంగాణ మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం తీరుకు నిరసనగా కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించటంతో పాటు అక్కడే నిరసనకు దిగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మరి కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారితే అది తెలంగాణకే నష్టం కలిగిస్తుందని మంత్రి జానారెడ్డి, ఇంకొందరు మంత్రులు వాదిస్తున్నట్లు సమాచారం. తమను, తెలంగాణ ప్రజల మనోభావాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరణ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికమని దీనిని తాము తప్పనిసరిగా సభలో లేవనెత్తుతామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా టీ మంత్రులకు ఫోన్ చేసి కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించాలని సూచించినట్లు తెలిసింది.
 
 నేటి నుంచి నాలుగు రోజుల భేటీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమెదానికి అసెంబ్లీ, శాసనమండలి సోమవారం నుంచి సమావేశం కానున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. 11వ తేదీ మినహా తక్కిన మూడు రోజులు సమావేశాలుంటాయి. సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం తెలిపారు.
 

Advertisement
Advertisement