కిరణ్ ‘రచ్చ’ | Sakshi
Sakshi News home page

కిరణ్ ‘రచ్చ’

Published Fri, Nov 22 2013 4:54 AM

kiran kumar reddy flex destroyed

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో నిర్వహిస్తున్న మూడో విడత రచ్చబండకు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. రాష్ర్ట విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న తరుణంలో రచ్చబండ సభల్లో సీఎం కిరణ్ ఫ్లెక్సీలు, ఫొటోలు, సందేశాన్ని తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి సభలో అధికారులు, తెలంగాణవాదులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. మొదటి, రెండు విడతలో దరఖాస్తు చేసుకున్నవారికి పింఛన్లు, కూపన్లు పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటి అవుతోంది. గురువారం కూడా దిలావర్‌పూర్, సారంగాపూర్, ముథోల్, కోటపల్లి, నార్నూరు, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఇదే తంతు కొనసాగింది.
 
 ఏడు మున్సిపాలిటీలు, 52 మండలాలు కలిపి 15 రోజుల్లో మొత్తం 59 సభలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు 49 సభలు నిర్వహించిన అధికారులు మంచిర్యాల, సిర్పూరు-టి, ముథోల్ నియోజకవర్గాల్లో మొత్తం పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి మున్సిపాలిటీలతోపాటు మరో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్వహించాల్సి ఉంది. అయితే రచ్చబండ సభల్లో ఇన్‌చార్జి మంత్రి నియమించిన త్రిసభ్య కమిటీ దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కూపన్లు పంపిణీ సందర్భంగా హంగామా సృష్టించడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అనుచరులు జిల్లా వ్యాప్తంగా హల్‌చల్ చేస్తుండటం అక్కడక్కడ రచ్చబండ రాజకీయ సభలను తలపిస్తున్నాయన్న విమర్శలున్నాయి.
 
 ఫ్లెక్సీల చించివేత.. సందేశానికి అడ్డంకులు..
 ఈ నెల 11 నుంచి 26 వరకు సుమారు 15 రోజుల పాటు నిర్వహించే రచ్చబండ కోసం అధికారులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి మొదటి, రెండో విడతలకు భిన్నంగా మండల కేంద్రాలు, పట్టణాలకే రచ్చబండను పరిమితం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలో రచ్చబండల్లో సీఎం కిరణ్  ఫొటో లు, ఆయన సందేశం వినిపించడంపై సర్వత్రా నిరసనలు తెలుపడంతో సభలు ‘రచ్చ’ రచ్చగా మారాయి. ప్రారంభం రోజే 13న ఆదిలాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు, జేఏసీ సభ్యులు చించివేసి, సందేశం వినిపించద్దంటూ అడ్డుకోవడం రాష్ట్రస్థాయిలో రసాభాసగా మారింది. సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్ ఫొటోలను తెలంగాణ  జిల్లాల్లో వాడొద్దంటూ నిరసనలకు దిగడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇదిలా వుంటే ఎంపీటీసీ, మున్సిపల్‌తోపాటు 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆధికార కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కార్యక్రమాల రూపకల్పన జరిగిందంటూ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి, రెండో విడతల్లో స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిశీలించి పూర్తిగా ‘అధికార’ ముద్ర ఉండేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
 రాజకీయ సభలను తలపించిన ‘రచ్చబండ’
 మూడో విడత రచ్చబండ సభల్లో అత్యధికంగా నిరసనలు వెల్లువెత్తగా, మరికొన్ని చోట్ల రాజకీయ సభలను తలపించాయి. పొంచివున్న ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీ తాయిలాల పంపిణీకే రచ్చబండ నిర్వహిస్తుందన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో రచ్చబండపై ‘అధికార’ ముద్ర వేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల సిఫారసు మేరకు నియోజకవర్గాలు, మండలాలవారీగా ఇన్‌చార్జి మంత్రి వేసిన కమిటీలు సభల్లో హల్‌చల్ చేశాయి. కాగా, మూడో విడుత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధదారులకు పూర్తిస్థాయి రేషన్ కార్డులు ఇవ్వకుండా సరిగ్గా ఏడు నెలలకు సరిపడా (డిసెంబర్ 2013 నుంచి జూన్ 2014 వరకు) రేషన్ కూపన్లు పంపిణీ చేస్తూండటం గమనార్హం. ఓ వైపు తెలంగాణవాదుల నిరసనలు, మరోవైపు అధికార పార్టీ కార్యకర్తలు చేసిన హంగామా అధికారులకు తలనొప్పిగా మారాయి. ఇదిలా వుండగా నార్నూరు మండల కేంద్రంలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై ఐటీడీఏ పీవో జె.నివాస్‌తో వాగ్వావాదానికి దిగి సభను బహిష్కరించారు. దిలావర్‌పూర్, సారంగపూర్ మండలాల్లో జరిగిన సభలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. భీమిని మండల కేంద్రం లో జరిగినన సభలో అధికారులతోపాటు ఎమ్మెల్యే గుండా మల్లేశ్ పాల్గొన్నారు.  కోటపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన మూడో విడుత రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ వాదులు సీఎం ఫ్లెక్సీని తొలగించారు. ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొని మాట్లాడారు. ముథోల్ రచ్చబండలో ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, గుడిహత్నూర్‌లో గోడం నగేశ్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement