సర్కారుకు బుద్ధి ‘వైకల్యం’! | Sakshi
Sakshi News home page

సర్కారుకు బుద్ధి ‘వైకల్యం’!

Published Sat, Nov 23 2013 4:05 AM

సర్కారుకు బుద్ధి ‘వైకల్యం’! - Sakshi

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన వెంకట్‌కు ఒక కన్ను పూర్తిగా పోయింది. ఆయనకు పోయింది ఒక్కటే కదా.. ఇంకో కన్నుతో చూస్తున్నాడు అని అప్పటివరకు ఇస్తున్న వికలాంగ పింఛన్‌ను తొలగించారు.

  •      విశాఖపట్టణం జిల్లాకు చెందిన సూర్యారావుకు పుట్టుకతో పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. ఇంకో కాలుండగా ఏం రోగం? అంటూ నెలవారీ ఇచ్చే  రూ.500 పింఛన్ నిలిపివేశారు.
  •      అనంతపురానికి చెందిన ఆంజనేయులుది కూడా ఇదే దుస్థితి. ఆయనకు చెవుడున్నా సరిగా రికార్డు కాలేదని నిర్దాక్షిణ్యంగా పింఛన్‌కు కోత పెట్టారు.

 
 ఈ పరిస్థితి ఈ ముగ్గురిదే కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.3 లక్షల మంది పింఛన్లకు కోత విధించారు. ఖజానాపై భారం తగ్గించుకునేందుకు వికలాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను కూడా వైకల్య శాతం తక్కువ ఉందన్న నెపంతో మానవత్వం లేకుండా నిలిపివేసింది. ప్రభుత్వం సాక్షాత్తూ మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)కు ఇచ్చిన రాతపూర్వక హామీని కూడా నిలబెట్టుకోలేదు. పింఛన్ కట్ చేసినా వైకల్యశాతాన్ని పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే బకాయిలతో సహా రచ్చబండ లాంటి కార్యక్రమాల్లో చెల్లిస్తామని హెచ్‌ఆర్‌సీకి చెప్పిన సర్కారు ఆ మాటే మరిచింది.
 
 బకాయిలూ ఇస్తామన్నారు...
 తమ పింఛన్‌ను అన్యాయంగా కోసేశారని, జీవనభృతిగా ప్రభుత్వం చెల్లించే రూ.500 ఇవ్వకుండా హక్కులను కాలరాస్తున్నారని వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన వికలాంగులు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో నిలిపివేసిన వికలాంగ పింఛన్‌ను పునరుద్ధరించాలని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వికలాంగులకు పింఛన్ ఇప్పించాలని వీహెచ్‌పీఎస్ అధ్యక్షుడు అందె రాంబాబు ఈ ఏడాది ఆగస్టు 19న కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కమిషన్ జారీ చేసిన నోటీసులపై గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈవో రాజశేఖర్ సెప్టెంబర్ 7న సమాధానమిచ్చారు. సదారం క్యాంపుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల మంది విక లాంగుల పింఛన్ తొలగిం చటం వాస్తవమేనని, వీరందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించి అర్హులకు బకాయిలతో సహా పింఛన్ చెల్లిస్తామని రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం చివరిసారిగా నిర్వహిస్తున్న రచ్చబండలో కూడా ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఈ విషయమై వీహెచ్‌పీఎస్ నేతలు సెర్ప్ అధికారులను కలిసినా ఫలితం లేదు.
 
 అసలేం జరిగింది....?
 వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ‘సాఫ్ట్‌వేర్ ఫర్ ఎసెస్‌మెంట్ ఆఫ్ డిజెబిలిటీ ఫర్ యాక్సెస్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్(సదారం) క్యాంపుల పేరుతో  వికలాంగ పింఛన్లను ఈ ప్రభుత్వం కోసేసే పనిలో పడింది. ఈ క్యాంపుల్లో వికలాంగులు వైకల్య శాతాన్ని నిర్ధారించుకోవాలని, అక్కడ ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతానికి మించి వైకల్యం ఉంటేనే పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ క్యాంపుల శాస్త్రీయతపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలున్నా పట్టించుకోకుండా ఆదరాబాదరాగా లెక్కలు కట్టి దాదాపు 2 లక్షల మంది వికలాంగుల పింఛన్లను తొలగించింది. 2009 డిసెంబర్‌లో ప్రారంభమైన పింఛన్ల కోత దాదాపు ఏడాది పాటు సాగింది. అప్పటి నుంచి వికలాంగుల పింఛన్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement