ఈ ఏడాది ఫుల్ కరెంట్ ఇస్తాం.. | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది ఫుల్ కరెంట్ ఇస్తాం..

Published Sun, Jan 5 2014 2:22 AM

ఈ ఏడాది ఫుల్ కరెంట్ ఇస్తాం.. - Sakshi

మీరు రుణాలివ్వండి!
 బ్యాంకర్లతో ముఖ్యమంత్రి


 సాక్షి, హైదరాబాద్: ‘‘గత ఏడాది సమస్యలున్న మాట వాస్తవం...పలు ఇబ్బందుల వల్ల పరిశ్రమలకు, ఇతర రంగాలకు విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయాం. ఈ ఏడాది మాత్రం అలా జరగదు. వంద శాతం కరెంట్ సరఫరా చేస్తాం. పారిశ్రామికవేత్తలకు, ఇతర రంగాల వారికి మీరు రుణాలు ఇవ్వండి’’అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంక ర్లకు సూచించారు. శనివారం సాయంత్రం ఇక్కడ జూబ్లీహాల్‌లో లీడ్ బ్యాంకు (ఆంధ్రాబ్యాంకు) మేనేజింగ్ డెరైక్టర్ రాజేంద్రన్ అధ్యక్షతన 182వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, పితాని సత్యనారాయణ, పి. బాలరాజు, సారయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి, మాణిక్యవరప్రసాద్, తోట నరసింహం, అహ్మదుల్లా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని, అయితే వీరికి రుణాలివ్వడంలో బ్యాంకర్లు ఆసక్తి కనబరచడం లేదన్నారు. ఈ ఏడాది విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని, వేసవిలో కూడా కోతల్లేకుండా సరఫరా చేస్తామని హామీనిచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే రైతులకు, మహిళలకు లక్ష్యం మేర రుణాలను ఇవ్వడానికి ప్రయత్నించాలని చెప్పారు. వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఏరియా నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని సీఎఎస్‌ను ఆదేశించారు. రైతుల కోసం కేంద్రం తీసుకువస్తున్న కొత్త చట్టం వల్ల గిడ్డంగుల నిర్మాణ అవసరం మరింత పెరగనుందన్నారు. ఇందు కోసం అర్హులైన వారికి రుణాలను ఇవ్వాలని చెప్పారు. అలాగే డెయిరీ, ఫౌల్ట్రీ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు రుణ మంజూరీలో వెనకున్న రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. మంత్రులు మాట్లాడుతూ తమ శాఖల్లోని లబ్ధిదారులకు రుణాలు సరిగ్గా అందడం లేదని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకులు తమ శాఖలను మూసేస్తున్నాయని, దానివల్ల ప్రభుత్వం అమలు చేసే పథకాలు పేదలకు అందడంలేదని బాలరాజు చెప్పారు. కాగా కౌలు రైతులకు రుణాలివ్వడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

 కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలి: ఏపీపీఎఫ్

 కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ (ఏపీపీఎఫ్) ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. శనివారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం సందర్భంగా ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు డి. సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడచిన ఏడాది కాలంలో పెరిగిన దాణా ధరలు, గుడ్లు, చికెన్‌కు సంబంధించి ఖర్చులు-రాబడుల మధ్య పెరిగిన వ్యత్యాసం వంటి అంశాలు పరిశ్రమను, ఈ పరిశ్రమపై ఆధారపడుతున్న వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ బ్యాంకింగ్ వ్యవస్థకు విజ్ఞప్తి చేసినప్పటికీ, కొన్ని బ్యాంకుల నుంచి తగిన స్పందన లేదని వివరించారు. బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏడాది పాటు మారటోరియాన్ని అమలుచేయాలని, రుణాల్ని పునర్‌వ్యవస్థీకరించాలని, అవసరమైన పెట్టుబడులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement