సీఎంగా ఉండటం దురదృష్టం | Sakshi
Sakshi News home page

సీఎంగా ఉండటం దురదృష్టం

Published Thu, Jan 23 2014 1:38 AM

సీఎంగా ఉండటం దురదృష్టం - Sakshi

 శాసనసభలో కిరణ్‌కుమార్‌రెడ్డి
 విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నా
 అన్ని ప్రాంతాలవారి అంగీకారంతోనే అప్పుడు రాష్ట్రం ఏర్పడింది
 ఇప్పుడు అన్ని ప్రాంతాలవారి అంగీకారం ఉంటేనే విభజన జరగాలి.. కలిసి ఉన్నందునేఅన్ని రంగాల్లో అభివృద్ధి

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా అందరూ భావిస్తారని, కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టంగా తాను భావిస్తున్నానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, సోనియూగాంధీ వల్ల ముఖ్యమంత్రిని అయ్యూనని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీలో టీ బిల్లుపై ఆయన చర్చలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాలవారి అంగీకారంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటూ.. ఇప్పుడు అన్ని ప్రాంతాలవారి అంగీకారం ఉంటేనే విభజన జరగాలన్నారు. గతంలో అద్వానీ అసెంబ్లీ తీర్మానం ఉంటేనే తెలంగాణ ఏర్పాటును పరిశీలిస్తామన్నారని, అలాగే 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి అసెంబ్లీ తీర్మానంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారని సీఎం గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా తెలంగాణ అంశం తొలుత అసెంబ్లీ తీర్మానానికి వస్తుందని, ఆ తరువాత బిల్లు సభ అభిప్రాయానికి వస్తుందని చెప్పారు.. కానీ అందుకు భిన్నంగా జరిగిందని అన్నారు. తెలంగాణ అంశాన్ని అసెంబ్లీ తీర్మానం కోసం ఎందుకు పంపించలేదని ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు. గతంలో ఏకాభిప్రాయంతో, అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఇప్పుడెందుకు ఆ విధానం అనుసరించడం లేదని ప్రశ్నించారు. 1947 నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎవరేవిధంగా తీర్మానాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది, ఇందిరాగాంధీ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరాకరిస్తూ పార్లమెంట్‌లో ఏం మాట్లాడారు, ఇతర చరిత్రను ఆయన వివరించారు. సీఏం ఉపన్యాసం ఆయన మాటల్లోనే...
 

  •  - మొదటి ఎస్‌ఆర్సీ ప్రధానంగా రెండు అంశాల ఆధారంగా రాష్ట్రం కలిసి ఉండాలని స్పష్టం చేసింది. తెలుగువారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. సంస్కృతి, భాష ఒక్కటే. కృష్ణా, గోదావరి జీవ నదులున్నాయి. ఒక రాష్ట్రంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. రైతుల సాగునీరుకు ఇబ్బంది ఉండదు.. అని భావించింది.
  •  - తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో బలవంతంగా కలపలేదు. తెలంగాణ వారందరూ కలిసి ఉండాలంటేనే కలిపారు. బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్ర కావాలని తెలంగాణ అసెంబ్లీలో కోరారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1971లో జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయి. ఆ రెండింటికీ ఇందిరాగాంధీ 1973లో పరిష్కార మార్గాలు చూపారు.
  •  - పార్లమెంట్‌లో ఇందిరాగాంధీ చాలా దూరదృష్టితో ఆలోచించి ప్రసగించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నారు. ఎన్ని రాష్ట్రాలు చేసినా పక్కపక్కనే ఉండాలి కాబట్టి 101 సమస్యలు వస్తాయన్నారు. విభజనతో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. ఆమె పార్లమెంట్‌లో మాట్లాడిన పరిస్థితి మన పరిస్థితికి దగ్గరగా ఉంది.
  •  - రాయలసీమ ఉద్యోగుల సమస్యలపై 1985లో జయభారత్‌రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తెలంగాణలో తెలంగాణేతర ఉద్యోగులు 58,962 మంది ఉన్నారని తేల్చింది. ఆంధ్రాలో కూడా ఇతర ప్రాంతాలకు చెందిన 37,739 మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. రాయలసీమలో 11,316 మంది ఇతర ప్రాంతాల ఉద్యోగులున్నారని తెలిపింది.
  •  - తెలంగాణా ప్రాంతంలో ఉద్యోగాలు పోయాయనడం వాస్తవం కాదు. ఆరు సూత్రాల పథకం వచ్చింది. 610 జీవో ఇచ్చారు. ఆ జీవో అమలుపై వివిధ కమిటీల ద్వారా ఉద్యోగుల స్థానికతపై తనిఖీలు నిర్వహించాం. 5,10,300 ఉద్యోగుల స్థానికతను తనిఖీ చేశారు. 18,856 మంది ఇతర ప్రాంతాల ఉద్యోగులు తెలంగాణలో ఉన్నట్లు తేలింది.
  •  -రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4,062 ఉద్యోగులు మినహాయింపు పొందారు. మిగతా 14,794 ఉద్యోగులకు గాను 14,784 మందిని వారి స్థానిక స్థానాలకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చాం. రెండు శాఖల నుంచి 11,740 ఉద్యోగులు వెనక్కు వెళ్లారు. హోం, పాఠశాల విద్యాశాఖల్లో వెనక్కు వెళ్లారా లేదా? అనే సమాచారం లేదు. 32 మంది సుప్రీంకోర్టుకు వెళ్లారు.
  •  -కలిసి ఉన్నందునే రాష్ట్రానికి పలు పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్నందునే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతున్నాం. రాష్ట్ర విభజన జరిగితే ఆర్థిక వనరులు బాగా తగ్గిపోతాయి.
     

Advertisement
Advertisement