బిల్లును తిరస్కరించండి | Sakshi
Sakshi News home page

బిల్లును తిరస్కరించండి

Published Sun, Jan 26 2014 1:25 AM

kiran kumar reddy seeks speaker to get back bifurcation bill


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ చేపట్టిన చాలా రోజుల తర్వాత.. దాన్ని తిరస్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. బిల్లును తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని శాసనసభ నియమావళి 77వ నిబంధన కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసు పంపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013ను తిరస్కరించేందుకు ప్రభుత్వం తరఫున సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాను. అనుమతించగలరు’’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతోపాటు సభలో ప్రవేశపెట్టనున్న తీర్మానం ముసాయిదా ప్రతిని కూడా జతచేశారు.


 సీమాంధ్ర మంత్రులతో భేటీ: శనివారం శాసనసభ ముగిసి.. సోమవారానికి వాయిదా పడిన అనంతరం సీఎం కిరణ్ అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో సీమాంధ్ర మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్, పి.బాలరాజు, కొండ్రు మురళీమోహన్, తోట నరసింహం, డొక్కా మాణిక్యవరప్రసాద్, అహ్మదుల్లా,  ముగ్గురు ఎంపీలు పాల్గొన్నారు.
 
 తీర్మానం చూపి.. సంతకం: విభజన బిల్లులో తప్పులున్నాయని పేర్కొంటూ దాన్ని తిరస్కరిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వారికి సీఎం ఈ సందర్భంగా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. అప్పటికే తాను రూపొందించిన నోటీసును, ముసాయిదా తీర్మానాన్ని వారికి చూపించి సంతకం చేసినట్లు తెలిసింది. సీఎం ఆ వెంటనే సదరు నోటీస్‌ను మంత్రి శైలజానాథ్ ద్వారా స్పీకర్‌కు పంపారు.


 
 నోటీసుకు పలువురి మద్దతు: సమైక్యవాదాన్ని బలపరుస్తున్న మంత్రులు సీఎం నోటీసుకు మద్దతు పలకగా.. మంత్రులు బాలరాజు, మాణిక్యవరప్రసాద్, కొండ్రు మురళీమోహన్ తదితరులు మాత్రం మౌనం వహించినట్లు తెలిసింది. నోటీసు సమాచారం ముందుగానే తెలుసుకున్న ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
 
 మండలిలో సీఆర్ నోటీసు: సీఎం సూచన మేరకు శాసనమండలిలో నాయకుడైన మంత్రి సి.రామచంద్రయ్య సైతం మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణికి నోటీసు పంపారు. శాసనమండలి నియామవళి మేరకు 76వ నిబంధన కింద.. విభజన బిల్లును తిరస్కరిస్తూ ప్రభుత్వం తరఫున తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.
 
 స్పీకర్, చైర్మన్ ఏం చేయబోతున్నారు?
 
 ప్రభుత్వం తరపున సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సి.రామచంద్రయ్యలు ఇచ్చిన నోటీసులపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణిలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇటీవల శాసనసభ స్పీకర్‌కు సభా నియమావళి 77 కింద నోటీసు కూడా అందజేశారు. దీంతోపాటు ప్రతి రోజూ సభలో ఈ మేరకు వాయిదా తీర్మానం రూపంలో ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్లు గడువు ముగిసే సమయంలో ఇప్పుడు ప్రభుత్వమే విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమై స్పీకర్‌కు నోటీస్ ఇవ్వటాన్ని తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ ఏం చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. సోమవారం బీఏసీ నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారని శాసనసభా వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ కూడా ఏకాభిప్రాయం రాని పక్షంలో శాసనసభలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని, మెజారిటీ అభిప్రాయం మేరకు వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement