తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ | Sakshi
Sakshi News home page

తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ

Published Sat, Nov 23 2013 11:52 PM

తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ

కొడుకు జ్ఞాపకాల్లో బతుకుతున్న తల్లి  
నేడు మావోయిస్టు నేత కిషన్‌జీ రెండో వర్ధంతి
 
 పెద్దపల్లి, న్యూస్‌లైన్: సమసమాజ స్థాపన కోసం మూడున్నర దశాబ్దాలు పాలకుల గుండెల్లో నిద్రించిన విప్లవయోధుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ. సాయుధ పోరాటంలో శిఖరమంత ఎత్తు ఎదిగి.. పోలీసుల తూటాలకు కుప్పకూలిన కోటేశ్వర్ రావు విప్లవ బాట పట్టేందుకు తెలంగాణ భావజాలమే బీజాలు నాటింది. విద్యార్థి దశలోనే కోటేశ్వర్‌రావు తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. నాటి పీపుల్స్ వార్ నుంచి..నేటి మావోయిస్టు పార్టీకి మూల స్తంభంగా ఎదిగిన కోటేశ్వర్‌రావు పాతికేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ప్రహ్లాద్, కిషన్‌జీ పేర్లతో పలు రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని నడిపించారు.
 
 కుటుంబమే ధిక్కార స్వరం...
 
 కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్‌రావు కుటుంబ సభ్యులందరిది ధిక్కార స్వరమే. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. రజాకార్లను ఎదురొడ్డిన ధీరుడు. తండ్రి అడుగుజాడల్లో నడచిన కోటేశ్వర్‌రావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్‌రావు ఆనాడే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా గళమెత్తారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నియమనిష్టలతో జీవనం సాగించాల్సిన అన్నదమ్ములు దళిత, బహుజన బానిస బతుకుల విముక్తి కోసం తుపాకీ పట్టారు. తల్లి మధురమ్మ కూడా భర్తతో పాటు రజాకార్లను ఎదురించింది. రజాకార్లతో జరిగిన సమరంలో వెంకటయ్య అజ్ఞాతవాసం వెళ్లి, జైలు పాలయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత విడుదలయ్యారు. అప్పటినుంచి వెంకటయ్య కుటుంబం పదిహేనేళ్లపాటు ప్రశాంతంగా ఉంది.
 
 1969లో జై తెలంగాణ సభ
 
 తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో వెంకటయ్యతో పాటు ఆయన కొడుకులు కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్‌లు ఉద్యమగొంతుకలై సర్కారును నిలదీశారు. 1969లో టీపీఎస్(తెలంగాణ ప్రజా సమితి) నాయకత్వాన పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో జై తెలంగాణ సభపై పోలీసులు దాడి చేసి, లాఠీచార్జి చేశారు. నాడు మల్లోజు కోటేశ్వర్‌రావుతో పాటు మరికొందరు యువకులు జైలు పాలయ్యారు. మిగిలినవారు విడుదల కాగా, కోటేశ్వర్‌రావు జైల్లోనే ఎక్కువ కాలం గడిపి విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు.
 
 1975 ఎమర్జెన్సీ కాలంలో రమేజాబీ, జిజియాబాయి అనే  మిహళలు పోలీసుల లైంగికదాడికి గురయ్యారు. ఈ సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బస్సును దగ్ధం చేశాయి. ఈ కేసులో కోటేశ్వర్‌రావు మరోసారి అరెస్టయి వరంగల్ జైలుకు వెళ్లారు. తెలుగు మహాసభ, విరసం వంటి సంస్థలతో కొనసాగిన అనుబంధంతో కోటేశ్వర్‌రావు విప్లవోద్యమానికి మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి విప్లవోద్యమంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. సమ సమాజ స్థాపన కోసం ఎక్కుపెట్టిన ఆయుధంతో పాల కుల గుండెల్లో నిద్రించిన కిషన్‌జీని పట్టుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు 36 ఏళ్లు పట్టింది.  2011 డిసెంబర్ 24న బెంగాల్ రాష్ట్రంలోని మిద్నాపూర్‌లోని కలోని అడవుల్లో కేంద్ర బలగాల చేతిలో హతమయ్యారు.
 
 హైదరాబాద్‌లో నేడు వర్ధంతి సభ..
 
 ఈనెల 24తో కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో అమరుడై రెండేళ్లు నిండుతున్నాయి. ఆయన రెండో వర్ధంతి సభను హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘాలు, విరసం సంయుక్తంగా నిర్వహిస్తుం డగా తిథి, వార నక్షత్రం ప్రకారం డిసెంబర్ 2న  ఆయన కుటుం బ సభ్యులు రెండో వర్ధంతి జరుపుతున్నారు.
 
 రాష్ట్రం చూడకముందే పొట్టన పెట్టుకున్నరు..
 కొడుకును చెంప మీద ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకున్న.. జై తెలంగాణ అంటూ టీపీఎస్ మీటింగ్‌కు వెళ్లి పోలీసుల నుంచి దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడంతో నా కొడుకు పడ్డ శ్రమకు, వాడు తిన్న లాఠీ దెబ్బలు వృథా పోలేదు. కాని తెలంగాణ రాష్ట్రం చూడకముందే కొడుకు కోటన్నను సర్కారు పొట్టనబెట్టుకుంది. మాయన వెంకటయ్య తెలంగాణ రజాకార్ల పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని చూశారు. స్వాతంత్య్ర సమరయోధులుగా నలుగురిలో సంతోషంగా గడిపారు. కాని కొడుకు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పూటయినా గడపకపోవడం విషాదం. ఆదివారంతో కొడుకు మరణించి రెండేళ్లు అవుతుంది. కొడుకు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మదినిండా కదులుతున్నాయి. అన్న వెనుకే నా చిన్న కొడుకు వేణు కూడా అడవిలోకి పోయింది. అడవిలో ఉన్న చిన్న కొడుకు వేణును ఒక్కసారి చూడాలని ఉంది.
 - మల్లోజుల కోటేశ్వర్‌రావు తల్లి మధురమ్మ
 

Advertisement
Advertisement