‘కోడెల’ దోపిడీపై చర్యలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

‘కోడెల’ దోపిడీపై చర్యలు తీసుకోవాలి

Published Tue, Aug 20 2019 8:46 AM

Kodela Sivaprasad Rao Illegal Activities In Narasaraopet - Sakshi

సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : అధికారం అడ్డంపెట్టుకొని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్‌ చేసిన దోపిడీపై చర్యలు తీసుకోవాలని పమిడిపాడు గ్రామ మాజీ సర్పంచ్‌ లాం కోటేశ్వరరావు సోమవారం కోడెల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎండీగా ఉన్న ఎన్‌సీవీ కార్యాలయాన్ని కోడెల శివరామ్, అతని అనుచరులు గతంలో ధ్వంసం చేసి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కలిగించారన్నారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోక పోగా తమపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలకు తెలియజేసేందుకే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గాన్ని, వ్యాపారులను వదలకుండా కేట్యాక్స్‌ వసూలు చేశారన్నారు. భవన నిర్మాణాలు మొదలపెట్టిన తర్వాత అధికారులచే పనులు నిలిపివేసి యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. కమ్మ హాస్టల్‌ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్‌టీఆర్‌ కళాశాలను అక్రమంగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా లక్షలాది రూపాయలు కోడెల శివరామ్‌ మెక్కాడన్నారు.

చివరకు అన్న క్యాంటీన్‌ భోజనాలను సైతం కోడెల కుమార్తెకు చెందిన సేఫ్‌ కంపెనీలో పనిచేసే కార్మికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. సొంత సామాజిక వర్గం కూడా చీదరించుకొనేలా కప్పం కట్టించుకొని, చివరకు కోడెల కుటుంబంతో సహా ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. మొదట కోడెల శివరామ్‌ కట్‌ చేయించిన కేబుల్‌ వైర్లను టాక్టర్‌లో తీసుకొచ్చిన లాం కోటేశ్వరరావు మాజీ స్పీకర్‌ ఇంటి ప్రాంగణంలో వాహనాన్ని అడ్డుగా నిలిపాడు. సమాచారం అందుకున్న టూటౌన్‌ ఎస్‌ఐ వెంకట్రావు సిబ్బందితో వెళ్లి నచ్చచెప్పటంతో ఆందోళనను విరమించారు.

Advertisement
Advertisement