నువ్వే.. నువ్వే! | Sakshi
Sakshi News home page

నువ్వే.. నువ్వే!

Published Sun, Mar 16 2014 3:01 AM

నువ్వే.. నువ్వే! - Sakshi

 మరణానికి ముందే పోస్టుమార్టం మొదలైపోయింది. ఆ మరణానికి కారణం మీరంటే.. మీరనే నిందారోపణలు, పరస్పర ఫిర్యాదులు ఊపందుకున్నాయి. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఎలాగూ మరణం(ఓటమి) తప్పదని గ్రహించినట్లున్నారు జిల్లా కాంగ్రెస్ భారాన్ని ప్రస్తుతం మోస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. దానికి బాధ్యులెవరన్న చర్చ వచ్చి తీరుతుంది. ఆ మచ్చ తమపై పడకుండా అప్రమత్తమవుతున్నారు. అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలు పూర్తికాకముందే.. ఆ ఎన్నికల్లో ఎదుర్కోబోయే పరాజయానికి బాధ్యత ఎవరన్నదానిపై కేంద్రమంత్రి కృపారాణి, రాష్ట్రమాజీ మంత్రి కోండ్రు మురళీ పరస్పర ఫిర్యాదులకు తెరతీశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోండ్రు అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన వర్గీయులతో  కూడా ఫిర్యాదులు చేయించాలని భావిస్తున్నారు. మరోవైపు కృపారాణి కూడా కోండ్రు మురళీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కనీసం సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 
 
 దర్పం తప్ప బాధ్యత ఏదీ?
 కృపారాణిపై ఫిర్యాదు 
 జిల్లాలో అధికార స్థానంలో ఉన్న ఏకైక నేత అయినప్పటికీ కృపారాణి పార్టీని పట్టించుకోవడం లేదని కోండ్రు వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె ఇంతవరకు పార్టీ నేతలతో చర్చించలేదని ఈ వర్గం ఆరోపిస్తోంది. జిల్లా కేంద్రానికి రావడం లేదు.. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్‌తో కూడా చర్చించనే లేదని కృపారాణికి వ్యతిరేకంగా ఫిర్యాదులు గుప్పిస్తోంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సత్యవతితోగానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్‌తోగానీ మాట్లాడటానికి కేంద్రమంత్రి ఇష్టపడటం లేదని కూడా కోండ్రు వర్గం చెప్పుకొచ్చింది. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులను కూడా పోటీ పెట్టలేని దుస్థితికి పార్టీని దిగజార్చారని ఆరోపిస్తోంది. కృపారాణి ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు.. అయినా తన భర్త, పార్టీ నాయకుడైన కిల్లి రామ్మోహన్‌రావుకైనా బాధ్యతలు అప్పగించకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనే పార్టీ పరిస్థితి ఇంతగా దిగజారితే.. ఇక జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కోండ్రు అధిష్టానానికి స్పష్టం చేశారు. కృపారాణి తీరు ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారిపోతుందని తేల్చిచెప్పేశారు. 
 
 అసలు కోండ్రు ఎక్కడున్నారు?
 కేంద్రమంత్రి ఎదురుదాడి
 కృపారాణి కూడా అంతే దీటుగా కోండ్రు మురళీపై ఎదురుదాడి చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని గుప్పిట్లో పెట్టుకుని కూడా పార్టీని ఆయన పట్టించుకోవడం మానేశారని అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. డోల జగన్ ఇంతవరకు పార్టీ సమావేశం నిర్వహించకపోవడాన్ని కోండ్రు వైఫల్యంగానే ఆమె చెప్పుకొస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల, ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాంలలోనే అత్యధికంగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్న విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలతో సామరస్యంగా మాట్లాడకుండా కోండ్రు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. 
 
 అందువల్లే పార్టీలో ఉండాల్సిన కొంతమంది కూడా రాజీనామా బాట పడుతున్నారని కృపారాణి అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకు పాలకొండ సీనియర్ నేత సామంతుల దామోదర రావు పార్టీ మారడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతున్నారు.  కోండ్రు మురళి ఇటీవల పాలకొండ వెళ్లినప్పుడు సామంతుల వర్గీయులతో సామరస్యంగా చర్చించకుండా హెచ్చరిక స్వరంతో మాట్లాడారని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. అదే విధంగా  శ్రీకాకుళం నియోజకవర్గంతోపాటు మరికొన్ని చోట్ల ఏమాత్రం స్థాయిలేని నేతలకు టిక్కెట్లు ఇప్పిస్తామని ఆయన హామీలు ఇచ్చేస్తుండటంతో పార్టీ మరింతగా దిగజారుతోందని కృపారాణి ఆరోపిస్తున్నారు. ఇలా కోండ్రు, కృపారాణి పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్‌లో విభేదాల కుంపటి రాజుకుంది. రాబోయే పార్టీ ఓటమికి కారణమంటూ ముందస్తుగానే పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్‌వర్గ విభేదాలు రక్తి కడుతున్నాయి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement